'ఆకలి కేకలు లేని తెలంగాణ కావాలి'

వనపర్తి : కుంటి సాకులతో తెలంగాణ రాష్ట్ర సర్కార్ సంక్షేమ పథకాలకు గండికొడుతోందని వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. బుధవారం వనపర్తిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో అర్హులైన లబ్ధిదారులను ముప్పు తిప్పలు పెడుతోందని, సామాన్యుని ఆగ్రహానికి గురయ్యే ఏ పార్టీ చరిత్రలో నిలువ లేదన్నారు. రైతులకు రుణమాఫీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, రోగులకు ఆరోగ్యశ్రీ వంటి కీలక పథకాలలో అర్హులను వేధిస్తోందని మండిపడ్డారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు ఒకలా మాట్లాడి.. గెలిచాక మరో మాట మాట్లాడుతుండడంతో సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు. బంగారు తెలంగాణను ఆవిష్కరిస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి ముందు ఇక్కడి ఆకలిని పారదోలాలని సూచించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో మొదలు పెట్టిన సాగునీటి పథకాలను వెంటనే పూర్తిచేస్తే తెలంగాణ సస్యశామలం అవుతుందన్నారు.

తెలంగాణలో రైతుల ఆత్మహత్యలను ముఖ్యమంత్రి తేలికగా తీసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రైతుల రుణామాఫీపై గతంలో వైస్సార్ ఎలాంటి షరతులు విధించకుండా ఒక్క దఫాలో రుణాన్ని మాఫీ చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ మాత్రం నాలుగు ధఫాలుగా రుణాన్ని మాఫీ చేస్తాననడం భాధాకరమన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో వైఎస్సార్ సీపీని పటిష్ట పరుస్తామని.. గ్రామస్థాయి నుంచి పార్టీని నిర్మిస్తామన్నారు. అనంతరం వనపర్తికి చెందిన తెలంగాణ ఉద్యమ నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డితో పాటు పలువురు న్యాయవాదులు, పెద్దగూడెం మాజీ సర్పంచ్ కృష్ణయ్య, ఆయన అనుచరులను పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.

పల్లెపల్లెకు తిరిగి పార్టీని బలోపేతం చేస్తాం: ఎడ్మ కిష్టారెడ్డి

లక్షలాది మంది ప్రజల గుండెల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై గల ప్రేమాభిమానాలు గూడుకట్టుకుని ఉన్నాయని, వాటిని తట్టి లేపేందుకు పల్లెపల్లెకు తిరిగి ఆయన ఆశయ సాధనకు వైఎస్సార్ సీపీని బలోపేతం చేస్తానని ఆ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి పేర్కొన్నారు. నవ తెలంగాణలో సమగ్ర అభివృద్ధి జరగాలంటే సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయడంతో పాటు వైఎస్సార్ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ సత్వరం పూర్తి చేయాలన్నారు.

వృద్ధులు, వికలాంగులు, వితంతువుల, పింఛన్లు పెంచుతామని చెప్పిన టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక అనర్హత పేరుతో చాలామంది అర్హులకు మొండిచేయి చూపించారని విమర్శించారు. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని భావించినా ఎనిమిది నెలలుగా ఏ ఒక్క పథకం పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో ప్రజలంతా ఆవేదనలో ఉన్నారన్నారు.

ప్రజాభిమానం పక్కనపెట్టి ఇతర పార్టీల వారిని టీఆర్‌ఎస్‌లో చేర్చుకుని పనిలో సీఎం ఉత్సాహం చూపుతున్నారని, ఇది ఆ పార్టీకి అంత మంచిది కాదన్నారు. జిల్లాలో నాలుగు ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను వైఎస్ ఒకేసారి ప్రారంభించి 70శాతం పనులు పూర్తిచేయించారని గుర్తు చేశారు. మిగిలిన 30శాతం పనులను పూర్తి చేసేందుకు గత కాంగ్రెస్ సర్కారు వల్ల కాలేదని, టీఆర్‌ఎస్ సర్కారైనా ఈ పనులను పూర్తి చేసి జిల్లా రైతులకు సాగునీరందించాలని ఎడ్మ కోరారు.

పేదలకు భూ పంపిణీ ఊసేలేదు: నల్లా సూర్య ప్రకాష్

అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులందరికీ వ్యవసాయ యోగ్యమైన మూడెకల భూమిని అందిస్తానని కేసీఆర్ ఇచ్చిన హామీ ఇప్పటివరకు నెరవేర్చక పోవటం విడ్డూరంగా ఉందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నేత నల్లా సూర్య ప్రకాష్ విమర్శించారు. ఆర్భాటాలకు పోతున్న దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ఢిల్లీ ఓటర్లు తమ తీర్పుతో చావు దెబ్బకొట్టారని, దీనిని చూసైనా కేసీఆర్ కళ్లు తెరవాలని సూచించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి లాంటి నాయకుడిని మరో వందేళ్ల వరకు ప్రజలు గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు.
Back to Top