వైఎస్ పథకాలను నీరుగార్చే యత్నం హైదరాబాద్: ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు,
కేసీఆర్‌లు తమ వ్యక్తి గత మైలేజీ కోసం..ప్రజల గుండెల్లో దైవంగా నిలిచిపోయిన దివంగత
వైఎస్సార్  ప్రవేశపెట్టిన పథకాలను నీరుగార్చే
ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్సీపీ  తెలంగాణ
అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ  పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీఎంగా ఉండగా పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌ల కోసం
ఎంతో కృషిచేశారని, ఇప్పుడు ఇద్దరు సీఎంలు వాటిని నీరుగారుస్తున్నారని  విమర్శించారు. జాతీయ హోదా లభించిన పోలవరాన్ని చంద్రబాబు
పక్కనపెట్టి  పట్టిసీమ ఎత్తిపోతల అంటూ హడావుడి
చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు ప్రతిష్టాత్మకమైన ప్రాణహిత-చేవెళ్ల పథకాన్ని
కేవలం 4 జిల్లాలకు పరిమితం చేస్తామని కేసీఆర్ ప్రకటించడం సరికాదన్నారు. ఇటీవల ఆదిలాబాద్
సభలో దివంగత వైఎస్సార్‌ను ఉద్దేశించి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు.
మరణించిన వ్యక్తిని వ్యక్తిగతంగా విమర్శించొద్దనే ఆలోచన సీఎంకు ఉందో లేదోనని వ్యాఖ్యానించారు.
హైద్రాబాద్‌లోని  లోటస్‌పాండ్ వైఎస్సార్‌సీపీ
కేంద్ర కార్యాలయంలో పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్‌తో  కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్
వ్యాఖ్యలు తెలుగువారికి బాధ కలిగించాయన్నారు. చేసిన విమర్శలపై ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.
చనిపోయిన వ్యక్తిపై ఆరోపణలు, అపనిందలు దేస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు.  ప్రాణహిత -చేవెళ్ల ద్వారా 16.4 లక్షల ఎకరాలకు నీటిని
అందించేందుకు, హైదరాబాద్‌కు శాశ్వత నీటివనరులను అందించేందుకు 2008 మేలో వైఎస్ ప్రణాళిక
రూపొందించారని,  ఇన్నేళ్ల కాలంలో టీఆర్‌ఎస్
ఏనాడూ అది కరెక్ట్ కాదు, డిజైన్ మార్చాలని ఎందుకు డిమాండ్ చేయలేదని ప్రశ్నించారు.  ఇన్నేళ్ల తర్వాత డిజైన్ సరిగ్గా లేదని, నాలుగు జిల్లాలకే
పరిమితం చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని అని అన్నారు.

Back to Top