పోలీసులు హద్దు మీరి ప్రవర్తించారు: అంబటి

హైదరాబాద్, 07 జూన్, 2013:

తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని నాంపల్లిలోని కోర్టుకు తీసుకెళుతున్న సందర్భంగా పోలీసులు ఓవరాక్షన్ చేశారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీ జగన్మోహన్ రెడ్డిగారిని కోర్టులో హాజరుపరుస్తున్న సమయంలో చంచల్‌గుడా నుంచి నాంపల్లి వరకూ విచిత్రమైన పరిస్థితులను సృష్టించారన్నారు. అటు, ఇటూ అర కిలోమీటరు వరకూ ఎవరూ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారని ఎద్దేవా చేశారు. ఆర్నెల్ల తర్వాత తమ నేత జైలునుంచి బయటకు వస్తున్నాడని తెలిసి విచ్చేసిన అభిమానులకు నిరాశ కలిగించేలా కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించేలా చేశారని చెప్పారు.

శ్రీ జగన్మోహన్ రెడ్డి నేరస్థుడు కాదనీ, నిందితుడు మాత్రమేననీ, పైపెచ్చు ఆయన అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడనీ రాంబాబు గుర్తుచేశారు. 15వ లోక్‌సభకు శ్రీ జగన్ అత్యధిక మెజారిటీతో నెగ్గిన ఎంపీ అనే విషయాన్ని కూడా మరువరాదన్నారు. చంచల్‌గుడా దగ్గర పోలీసులు లాఠీచార్జి చేయడంతో మహిళలకు గాయాలు కూడా అయ్యాయని తెలిపారు. పోలీసులకు ఇంత చేయాల్సిన అవసముందా అని ప్రశ్నించారు. మనది ప్రజాస్వామ్య దేశమనీ, రాజరిక వ్యవస్థలోనో.. నిరంకుశ పాలనలోనో లేమనే విషయాన్ని కూడా గుర్తెరగాలన్నారు.

నిరూపణ కాని కేసులో జ్యుడిషియల్ రిమాండులో ఉన్న శ్రీ జగన్మోహన్ రెడ్డిని కలపవడానికి వీల్లేకుండా ఆయన కుటుంబ సభ్యులను కూడా నిలువరించడం పోలీసులకు ధర్మం కాదని రాంబాబు హితవుపలికారు. ఇంతేకాకుండా ఈ సందర్భంగా వారు అనేకమందిని నిర్బంధించారని కూడా చెప్పారు. శ్రీ జగన్ కోర్టుకు వెడుతున్న సందర్భంగా దివంగత మంత్రి పి. జనార్దన రెడ్డి కుమార్తె విజయా రెడ్డి నాంపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేస్తుంటే  ఆమెను కూడా అరెస్టు చేశారని తెలిపారు. పోలీసుల చర్య వెనుక ఏదో అదృశ్య శక్తి ఉందనీ, ఆ శక్తి ఇస్తున్న ఆదేశాల మేరకే వారిలా ప్రవర్తిస్తున్నారని అంబటి ఆరోపించారు.

టీడీపీ అసత్య ప్రచారం
జ్యుడిషియల్ రిమాండులో ఉన్న శ్రీ జగన్మోహన్ రెడ్డి ఎవరినీ కలుసుకోకూడదా? అలాగని ఏదైనా చట్టం ఉందా అంటూ టీడీపీ చేసిన ములాఖత్ ఆరోపణలపై ఆయన నిలదీశారు. శ్రీ జగన్ జైలులో ఉండి రాజకీయం చేస్తున్నారని వారంటున్నారనీ, ఆయన ఓ పార్టీకి అధ్యక్షుడు ఆయన రాజకీయం కాకపోతే ఇంకేచేస్తారు అని టీడీపీని ప్రశ్నించారు. శ్రీ జగన్ ఎవరిని కలవాలనుకుంటే వారిని కలిసేలా చేయాల్సిన బాధ్యత జైలు అధికారులపై ఉందని స్పష్టంచేశారు. ఆమేరకు వారికి తాను విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఏడాదిపాటు ఆయన్ని నిర్బంధించడమే తప్పనీ, ఆయన్ని వేరెవరూ కలుసుకోకుండా చేయడం మరింత తప్పనీ ఆయన వివరించారు. 'జైలులో ఖైదీలకు మద్యం సరఫరా చేస్తున్నారట.. ఇంకేవో చేస్తున్నారట' అంటూ ఈ ఆరోపణలు జగన్ గారిని ఉద్దేశించి చేసినవేనని మాకు తెలుసు అని స్పష్టంచేశారు. ఆయన మద్యం ముట్టుకునే వ్యక్తి కాదు.. ఏ పరీక్షైనా చేయించుకోండి.. రక్త పరీక్ష కూడా చేయించుకోండి వాస్తవం వెల్లడవుతుందన్నారు. ఇదే అంశంపై మేము సవాలు చేస్తే చంద్రబాబు నోరు మెదపలేదని ఎద్దేవా చేశారు. ములాఖత్‌లపై పదేపదే ఆరోపణ చేస్తున్న యనమల రామకృష్ణుడు న్యాయవాది.. పైగా అసెంబ్లీ స్పీకరుగా పనిచేసి వ్యక్తి.. ఆయనకు నిబంధనలు తెలియవనుకోవడం లేదన్నారు. జగన్ గారు ప్రజల్ని కలుసుకుంటే మీకేమిటి ఇబ్బంది అని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన అన్యాయంగా జైలులో ఉంచిన శ్రీ జగన్మోహన్ రెడ్డిగారిని విడుదల చేయాలని అడగడం మాని బంధనాలు కల్పించడం ఎంతవరకూ సబబని నిలదీశారు. శ్రీ జగన్ రిమాండు ఖైదీ కనుక ఆయన ఎప్పుడు ఎవర్ని కలవాలనుకుంటే అప్పుడు కలిసేందుకు అవకాశం కల్పించాల్సిందేనన్నారు. 42 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు జరిగితే వాటిలో 25 సీట్లలో టీడీపీ డిపాజిట్లు కోల్పోయిన విషయాన్ని గుర్తుచేసుకుని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని అంబటి హితవు పలికారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని లక్ష్యంగా చేసుకుంటే వారికే నష్టమనే విషయాన్ని గుర్తెరగాలని సూచించారు. ఇలాగే వ్యవహరిస్తే చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికే పరిమితమయ్యే పరిస్థితి వస్తుందన్నారు. శ్రీ జగన్మోహన్ రెడ్డిని దూషించి తన పార్టీని బలోపేతం చేసుకోవాలనే చంద్రబాబు వైఖరి తప్పని ఆయన చెప్పారు.

సమయం వస్తే జగన్ బయటకు రాకుండా ఎవరూ ఆపలేరు
ఎవరు తలలు బద్దలు కొట్టుకున్నా సమయం వస్తే శ్రీ జగన్మోహన్ రెడ్డి బయటకు రాకుండా ఎవరూ ఆపలేరని అంబటి పేర్కొన్నారు. అది సీబీఐ తరం కూడా కాదన్నారు.  మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తెరచాటు బాగోతం కారణంగానే శ్రీ జగన్ ఏడాదిగా జైలులో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. చంద్రబాబు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కుమ్మక్కయ్యారనడానికి  అనేక ఉదాహరణలున్నాయని ఓ ప్రశ్నకు బదులుచెప్పారు. తన పార్టీనుంచి ఎంతమంది పోయినా పరవాలేదని కిరణ్ ఎందుకనుకుంటున్నారో  చిన్నపిల్లాడిని అడిగినా చెపుతారని చెప్పారు. ఎవరితోటీ కుమ్మక్కవ్వాల్సిన దౌర్భాగ్య పరిస్థితి తమకు లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీతో లాలూచీ పడ్డారు కనకనే ఐఎమ్‌జీ విషయంలో చంద్రబాబును సీబీఐ విచారించడం లేదని అంబటి పునరుద్ఘాటించారు. అందుకే కదా చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టకుండా పారిపోతున్నది..? కాదని గుండెలమీద చేయివేసుకుని చెప్పమనండని ఆయన సవాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పట్ల కఠిన వైఖరి అనుసరిస్తామని బాబును గుండెల మీద చేయి వేసుకుని చెప్పాలని నిలదీశారు. లాలూచీ పడి ఉంటే తమ నేత ఏడాదిగా జైలులో మగ్గే పరిస్థితి వచ్చేది కాదు కదా అని అడిగారు. చంద్రబాబు వైఖరిని ప్రపంచానికి ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు వెల్లడించడానికే అవిశ్వాస తీర్మానం పెట్టామని ఆయన తెలియజేశారు.

Back to Top