పోలవరం ప్రాజెక్ట్ ను కేంద్రమే నిర్మించాలి..

పోలవరం ప్రాజెక్ట్ ను కేంద్రమే నిర్మించాలి..
 పోలవరం పై చంద్రబాబు పునరాలోచించాలి..
 పట్టిసీమ పేరుతో పోలవరాన్ని జాప్యం చేశారు..
వైయస్ తవ్విన కాల్వల్లో నీళ్లు వదిలి గొప్పగా చెప్పుకుంటున్నారు..
పోలవరం అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు నానా యాగీ చేస్తున్నారు..
ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల నుంచి వేల ఎకరాలు తీసుకున్నారు..
అధికారం చేపట్టి నాలుగేళ్లు కావస్తున్నా ఒక్క ఇటుక పెట్టలేదు..బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి..

 
హైదరాబాద్:  పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి కావాలంటే దాని బాధ్యతను వెంటనే కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని పిఎసి ఛైర్మన్ బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం కేంద్రం నిర్వహించాల్సిన పనులను, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుందో, ఇప్పుడు ఎందుకు కేంద్రానికి అప్పగించాలనుకుంటున్నారో స్పష్టత లేదన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం ప్రచారం కోసమే ముఖ్యమంత్రి పోలవరం పర్యటనలు తప్ప, వాటితో  క్షేత్ర స్థాయిలో ప్రయోజనం ఉండటం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు సంబంధించి విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నట్లుగా వ్యవహరించినట్లయితే, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం వెంటపడి పనులు చేయాలని, అలా కాకుండా పనులన్నిటినీ తన నెత్తిన వేసుకుని, నిధులు రాకుండా వ్యవహరించిందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన కు ముందు పోలవరం ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తాన్ని , ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా పరిగణించాలని స్పష్టంగా నిర్దేశించి, అటు తరువాత మొత్తం వ్యయాన్నంతటినీ కేంద్రమే భరిస్తుందని ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఇందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వమే పనులను కొనసాగిస్తోందన్నారు. రెండేళ్ల క్రితం వరకు పోలవరంమాట ఎత్తని ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి, సాగునీటి మంత్రి పట్టిసీమ పూర్తి అయిన తరువాతనే మాట్లాడటంలోని ఆంతర్యమేమిటన్నారు. ఇంతవరకు ముఖ్యమంత్రి 27 సార్లు, సాగునీటి శాఖ మంత్రి 47 సార్లు ప్రాజెక్టును సందర్శించారని దీని వల్ల ఏం సాధించారని ప్రశ్నించారు.ఇన్ని సార్లు పర్యటించినా పనుల్లో పురోగతి లేదంటా గణాంకాలను వివరించారు. వైయస్ ఆర్  హయాంలో నిర్మించిన కాలువలకు నీళ్లు విడుదల చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు.

చంద్రబాబు కంటే ముందు పనిచేసిన ముఖ్యమంత్రుల హయాంలో కూడా ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరిగాయనీ, అప్పట్లో ఇంతటి టెక్నాలజీ అందుబాటు లేకున్నా, పనులు పూర్తి అయ్యాయని గుర్తుచేస్తూ, ఆ ముఖ్యమంత్రులెవరూ కూడా ప్రాజెక్టు పనులను ఇలా ఇన్ని సార్లు సందర్శించలేదన్నారు. ప్రతి చిన్న దానిని , గ్రామాల్లో వీధిదీపాలు వెలిగాయా లేదా అన్న విషయాన్ని కూడా కంప్యూటర్ ద్వారా తెలుసుకుంటానని చెప్పుకునే  చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు సైట్ కు వెళ్లడం ప్రచారం,స్వలాభం కోసమే తప్ప కోసం తప్ప మరోటి కాదని బుగ్గన అన్నారు. టిడిపి ప్రభుత్వం కీలకమైన (2014-16 ) రెండేళ్ల కాలం పాటు పోలవరం గురించి పట్టించుకోకుండా,  పట్టిసీమ అంటూ హడావుడి చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక ప్యాకేజి అన్న అనంతరమే పోలవరం గురించి బయటకు తేవడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.  కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడంలో విఫలమై, ఇప్పుడు ప్రజలపై రుణాల భారాన్ని మోపాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా కళ్లు తెరచి ఈ ప్రాజెక్టు పనులను కేంద్రానికి అప్పగించాలని డిమాండ్ చేశారు.

ల్యాండ్ పూలింగ్ పేరుతో నానాయాగీ చేసి 33 వేల ఎకరాలను సేకరించి అన్నీ తాత్కాలిక భవనాలు తప్ప చేసిందేమీ లేదని, ఇంకా డిజైన్లను కూడా ఖరారు చేయలేదని బుగ్గున రాజేంద్రనాథ్ మండిపడ్డారు.  వర్షం పడితే, ఆరు బయట కంటే ఈ భవనాల్లోనే ఎక్కువ నీరు కురుస్తోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎవరైనా అక్రమాలను, నిర్లక్షానని ప్రశ్నిస్తే వారిపై నిందలు వేయడం తప్ప వాస్తవాలను పట్టించుకోవడం లేదన్నారు. ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తూ కాలం గడుపుతున్నారు తప్ప సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు.

తాజా వీడియోలు

Back to Top