స్పెషల్ స్టేటస్ పై ప్రధాని ప్రకటన చేయాలి

హైదరాబాద్, జూన్ 14: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రతిపత్తి కల్పించడం సాధ్యం కాదంటూ కేంద్ర ప్రణాళికా సంఘం ప్రకటించినట్లుగా వస్తున్న వార్తలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేస్తూ వెంటనే ప్రధానమంత్రి ఒక ప్రకటన చేయాలని కూడా కోరింది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ, 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంపై ప్రజలు ఆందోళనతో ఉన్నారు. రాష్ట్ర నిర్మాణం మొదటి నుంచి ప్రారంభం కావలసి ఉన్నందున ఆంధ్రప్రదేశ్ కు 20 ఏళ్ళపాటు ప్రత్యేక హోదా కల్పించవలసిందిగా మేము పార్లమెంట్ లో కోరాం. గతంలో కూడా ఇదే అంశంపై సభలో సుదీర్ఘంగా చర్చించాం. రాజ్యసభలో బీజేపీ నాయకులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు కూడా ఈ అంశంపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేయడంతో ఆంధ్రప్రదేశ్ కు 10 ఏళ్ళపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని నాడు సభలో ప్రధానమంత్రి స్వయంగా హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోవలసిందిగా మేము కోరుతున్నాం' అన్నారు మేకపాటి.

ఇప్పటికే తీవ్రమైన నిధుల కొరతతో ఒక వైపు, కొత్త రాజధాని నిర్మాణ సమస్యతో మరో వైపు రాష్ట్రం సతమతమవుతున్న తరుణంలో ప్రత్యేక హోదా కల్పనపై వస్తున్న వార్తలు అనేక అనుమానాలకు తావిస్తోందని ఆయన అన్నారు. ఈ అనుమానాలను నివృత్తి చేసేందుకు, ప్రజలలో నెలకొన్న భయాందోళనలను తొలగించేందుకు వీలుగా ప్రత్యేక హోదా కల్పన విషయంపై ప్రధానమంత్రి స్వయంగా ఒక విస్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతూ తాను ప్రధానమంత్రికి ఒక లేఖను ఫ్యాక్స్ ద్వారా పంపినట్లు మేకపాటి వెల్లడించారు.

తాజా ఫోటోలు

Back to Top