అక్రమ అరెస్ట్‌లతో వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై ఉక్కుపాదం

 

గుంటూరు :  పోలీసులు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు తొత్తులుగా మారార‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు మండిప‌డ్డారు. గురజాల నియోజకవర్గంలో పోలీసులు అక్రమ అరెస్ట్‌లతో వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై ఉక్కుపాదం మోపుతున్నార‌ని విమ‌ర్శించారు. నేడు పిడుగురాళ్ల, దాచేపల్లిలోని అక్రమ మైనింగ్‌ క్యారింగ్‌లో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిజనిర్ధారణ కమిటీ పర్యటించనున్న నేపథ్యంలో వైయ‌స్ఆర్‌సీపీ  ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పిన్నెళ్లి రామకృష్ణా రెడ్డి, పార్టీనేత కాసు మహేష్‌ రెడ్డిని పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. గురజాల నియోజకవర్గాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఇళ్లనుంచి బయటకు వచ్చిన అనేక మంది కార్యకర్తలను, పార్టీ నేతలను అక్రమంగా అరెస్ట్‌ చేసి కేసులు పెడుతున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ నిజ నిర్ధారణ కమిటీని అడ్డుకునేందుకు పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. నేతలేవరు బయటకు రాకుండా దాచేపల్లి, పిడుగురాళ్ల ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు.

కమిటీ పర్యటిస్తే అక్రమ మైనింగ్‌పై నిజాలు బయటకొస్తాయనే ఉద్దేశంతోనే ప్రభుత్వం భయపడుతోందని, అందుకే తమ నేతలను అక్రమంగా అరెస్ట్‌ చేశారని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా నియోజవర్గంలో పోలీసులు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు తొత్తులుగా మారారు. మూడు రోజుల క్రితం టీడీపీ ర్యాలీకి అనుమతించిన పోలీసులు వైయ‌స్ఆర్‌సీపీ నేతల పర్యటనను మాత్రం అడ్డుకుంటున్నారు. పర్యటన రద్దు చేసుకోకపోతే కేసులు పెడతామని హెచ్చరించిన పోలీసులు ముందుగానే  వైయ‌స్ఆర్‌సీపీ నేతలకు నోటీసులు పంపించారు.

అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో హైకోర్టును తప్పుదారి పట్టించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతున్నట్టు కనబడుతోంది. పల్నాడులో 28 లక్షల టన్నుల తెల్లరాయిని దోచుకున్నట్లు ఇటీవల నిర్ధారణ కమిటీ తేల్చిన విషయం తెలిసిందే. తనపై కేసులు రాకుండా టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని పన్నాగం కుట్రలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. టీడీపీ నేతలు అక్రమంగా కోట్లు దోచుకుంటున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. అధికార పార్టీ నాయకులకు దోపిడీలకు కళ్లెం వేయాలని ప్రజలు కోరుతున్నారు. 
Back to Top