వైయస్సార్‌ సీపీ ప్లీనరీకి విస్తృత ఏర్పాట్లు

సభాస్థలి వద్ద ఏర్పాట్ల పరిశీలన
అడ్డతీగల : ఈనెల ఏడో తేదీన అడ్డతీగలలో నిర్వహించే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రంపచోడవరం నియోజకవర్గ ప్లీనరీకి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, నియోజకవర్గ సమన్వయకర్త అనంత ఉదయభాస్కర్‌ తెలిపారు. ప్లీనరీ వేదికైన స్థానిక ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహం ఆవరణను ఆయన పార్టీ నాయకులతో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఉదయభాస్కర్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలోని పలు సమస్యలపై ప్లీనరీలో ప్రధానంగా చర్చ జరుగుతుందన్నారు. బూత్‌ కమిటీల నియామకం, ఆ కమిటీలు పనిచేసే విధానంపై చర్చిస్తారన్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీని అధికారంలోనికి తీసుకురావడానికి ఇప్పటి నుంచీ ఎలా సన్నద్ధమవ్వాల్లో పార్టీ శ్రేణులకు నాయకులు దిశా నిర్దేశం చేస్తామన్నారు. ఇక్కడి ప్లీనరీలో చర్చించిన అంశాలను జిల్లాస్థాయికి, అనంతరం రాష్ట్ర స్థాయి ప్లీనరీ దృష్టికి తీసుకువెళతామన్నారు. అడ్డతీగల ప్లీనరీకి పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, అరకు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకురాలు గిడ్డి ఈశ్వరి, రాజమండ్రి కార్పొరేషన్‌ ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి తదితర నాయకులు వస్తారన్నారు. ఏజెన్సీలోని11 మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలి రావాలని ఉదయభాస్కర్‌ కోరారు.

Back to Top