లెక్చరర్ల సమస్యను పరిష్కరించండి

నెల్లూరు రూరల్‌: కాంట్రాక్టు లెక్చరర్స్‌ని పర్మినెంట్‌ చేయాలని, వారి శ్రమకు తగ్గట్టుగా వేతనం అందించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తమను రెగ్యులరైజ్‌ చేయాలని కాంట్రాక్టు లెక్చరర్స్‌ చేపట్టిన దీక్షకు ఎమ్మెల్యే సంఘీభావం తెలిపారు. దీక్ష ప్రాంగణం వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్‌ కళాశాలలను తట్టుకొని ప్రభుత్వ కళాశాలలు ఇంకా బ్రతికి ఉన్నాయంటే, పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్నారంటే అందుకు కారణం లెక్చరర్ల అంకితభావమేనని అన్నారు. లెక్చరర్స్‌ అడిగిన న్యాయపరమైన డిమాండ్‌ను ప్రభుత్వం తీర్చకుంటే ప్రభుత్వ కళాశాలలు మూతపడి పేదవారికి విద్యదూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంట్రాక్టు లెక్చరర్స్‌ని పర్మినెంట్‌ చేయాలని నిండు అసెంబ్లీలో గళమెత్తిన చంద్రబాబు ఇప్పుడెందుకు వారి సమస్యను పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. ప్రతీదానికి లోటు బడ్జెట్‌ అనే నెపాన్ని ముందువేసుకునే చంద్రబాబు ఎమ్మెల్యేల జీతాలు పెంచేముందు, ప్రచార ఆర్భాటాలకు వందల కోట్లు ఖర్చు చేసేటప్పుడు తెలియదా అని నిలదీశారు. లెక్చరర్ల న్యాయపరమైన సమస్య పరిష్కరించే వరకు పోరాటం చేస్తానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌ సీపీ ఎస్సీ సెల్‌ నగర అధ్యక్షుడు తాళ్లూరు సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Back to Top