ప్రజల దాహార్తిని తీర్చండి

 డీఆర్వోకు వినతిపత్రం అందజేసిన వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు
చిలకలపూడి : పెడన నియోజవకర్గ పరిధిలో తాగునీరు లేక అల్లాడుతున్న ప్రజల దాహార్తిని తీర్చాలని వైయస్సార్సీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్‌ అన్నారు. మీకోసం కార్యక్రమంలో సోమవారం డీఆర్వో సీహెచ్‌ రంగయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని పెడన, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో ప్రజలు తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పశువులు సైతం తాగడానికి నీరు లేక వేసవి తాకిడికి చనిపోతున్నాయన్నారు. శివారు మండలాలైన బంటుమిల్లి, కృత్తివెన్నులలో తాగునీరు కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రతి గ్రామంలోనూ చెరువులు ఎండి గుక్కెడు నీరు దొరక్క అవస్థలు పడుతున్నారన్నారు. పెడన, గూడూరు మండలాలకు తాగునీరు సరఫరా చేసే ప్రధాన కాలువలైన రామరాజుపాలెం కాలువ, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాలకు తాగునీరు సరఫరా చేసే బంటుమిల్లి కాలువకు నీరు పూర్తిస్థాయిలో నిలుపి వేశారన్నారు. దీంతో నియోజకవర్గ ప్రజలు తాగునీటి కోసం కష్టాలు పడుతున్నారన్నారు. రామరాజుపాలెం, బంటుమిల్లి కాలువల ద్వారా పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసి నాలుగు మండలాల్లోని గ్రామాల్లో ఉన్న చెరువులను నింపి ప్రజల దాహార్తిని తీర్చాలని, పశువులను రక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ఉప్పాల రాము, పెడన మునిసిపల్‌ చైర్మన్‌ బండారు ఆనందప్రసాద్, పెడన ఎంపీపీ రాజులపాటి అచ్యుతరావు, పెడన మునిసిపల్‌కౌన్సిలర్లు కటకం ప్రసాద్, మెట్ల గోపీప్రసాద్, గరికిముక్కు చంద్రబాబు, ఎంపీటీసీల సంఘం జిల్లా కార్యదర్శి పిన్నెంటి మహేష్, వైఎస్‌ఆర్‌ సీపీ నాయకులు జల్లా భూపతిరాజు, బొమ్ము గంగాప్రసాద్‌ (బాబు), దావు బైరవలింగం, గూడూరు మండల పరిషత్‌ ప్రతిపక్ష నాయకులు గొరిపర్తి రవికుమార్, సంగా మధుసూధనరావు, జక్కా అర్జునభాస్కరరావు, కారుమంచి కామేశ్వరరావు, బండారు మల్లిఖార్జునరావు, మెరుగుమాల వెంకటేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Back to Top