ప్లాంట్‌ వద్దంటే లాఠీలు విసురుతారా!

బిక్కవోలు:

థర్మల్ విద్యుత్తు ప్లాంటు, రసాయన కర్మాగారాలు ఏర్పాటు వల్ల ఎదురయ్యే అనర్థాల పట్ల ఆందోళన చెందుతున్న ప్రజానీకానికి అండగా నిలబడవలసిన అధికారులు వారిపై విచక్షణారహితంగా లాఠీలు ఝుళిపించడం అన్యాయమని వైయస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, జ్యోతుల నెహ్రూ, పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లాలోని బిక్కవోలు, రంగంపేట మండలాల సరిహద్దు గ్రామాలుగా ఉన్న బాలవరం, జి. దొంతమూరు వద్ద థర్మల్ విద్యుత్తు ప్లాంటు, రసాయనిక  కర్మాగారం ఏర్పాటుపై కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకించిన వారిపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఆందోళనకారులను, లాఠీచార్జిలో గాయపడ్డ వారిని కలుసుకుని సంఘీభావం తెలిపారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించారనీ, తక్షణమే అక్కడకు వెళ్లి ప్రజలకు అండగా ఉన్నామనే భరోసాను అందించమని ఆదేశించారనీ మాజీ మంత్రి బోస్ వివరించారు. అవసరమైతే శ్రీమతి విజయమ్మ ప్రజలతో పాటు స్వయంగా ఉద్యమంలో పాల్గొనేందుకు కూడా సిద్ధంగా ఉన్నారన్నారు. పవర్ ప్లాంట్, కెమికల్ ఫ్యాక్టరీల నిర్మాణం వల్ల ఈ నాలుగైదు గ్రామాలకే కాకుండా డెల్టా ప్రాంతానికే తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఈ ఫ్యాక్టరీల నిర్మాణానికి సీఎం భూమిపూజ చేశారు కాబట్టి ఎలాగైనా నిర్మాణం చేస్తామన్నట్టు అధికారులు వ్యవహరించడం విచారకరమన్నారు.

ఉద్యమానికి పార్టీ సిద్ధం: జ్యోతుల

     దీనిని ఒక ఉద్యమంగా తీసుకువెళ్లడానికి పార్టీ సిద్ధంగా ఉందని పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ అన్నారు. ఇక్కడ జరిగిన సంఘటనలపై పార్టీ అధిష్టానం స్పందించి, ప్రజలకు అండగా నిల బడాలని, అవసరం అయితే దేనినైనా ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చిందని చెప్పారు. ఇప్పటికే తమ పార్టీకి చెందిన పడాల రాము ఈ ఉద్యమంలో ప్రజల వెంట నిలబడ్డారని, న్యాయం కోసం జరిగే పోరాటంలో ఆయనకు, ప్రజలకు పార్టీ పరంగా పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని చెప్పారు. ఇటువంటి ప్రజాసమస్యలపై పార్టీలకతీతంగా పోరాటం చేయవలసిన అవసరం ఉందన్నారు. కాగా, టీడీపీ నాయకులు దాడి వీరభద్రరావు, కాగిత వెంకట్రావు బాధితులను పరామర్శించారు.

Back to Top