మాచర్లటౌన్: రాష్ట్రంలో టీడీపీ రాక్షస పాలన కొనసాగిస్తూ ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులను, కార్యకర్తలను దారుణంగా చంపుతున్నారని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఆయన బుధవారం మాట్లాడుతూ అనంతపురం జిల్లాలోని రాప్తాడు మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ బీ ప్రసాద్‌రెడ్డిని దారుణంగా తహశీల్దార్ కార్యాలయంలో వేటకొడవళ్లతో నరికి చంపడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.<br/>అధికారంలో ఉన్నామన్న ధీమాతో అధికారులను సైతం తొత్తులుగా చేసుకొని తహశీల్దార్ కార్యాలయం లోపలే హత్య చేయడాన్ని బట్టి అధికారపార్టీ నాయకుల బరితెగింపు అర్థమవుతుందన్నారు. పూర్తి స్థాయిలో ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలని ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. అధికారపార్టీ రాజకీయ హత్యాకాండను ప్రజలకు వివరించి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలిపారు.