కాంగ్రెస్‌పై పగలు తిట్లు.. రాత్రికి మంతనాలు

పామర్రు (కృష్ణాజిల్లా),

16 సెప్టెంబర్ 2013: కాంగ్రెస్‌ పార్టీపై పగటిపూట తిట్ల పురాణం, రాత్రి వేళలో ఆ పర్టీ నాయకులతోనే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మంతనాలాడుతూ కుటిల రాజకీయాలు చేస్తున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ విమర్శించారు. వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధ్యక్షుడు శ్రీ వైయస్ జగ‌న్మోహ‌న్‌రెడ్డి బెయిల్‌ను అడ్డుకోవటమే ప్రధాన ఎజెండాగా చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కృష్ణా జిల్లా పామర్రులో పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రజాప్రయోజనాలను పణంగా పెట్టి, సొంత ప్రయోజనాల కోసం ఎంతటి దారుణానికైనా తెగించే వ్యక్తి చంద్రబాబు అంటూ సుభాష్‌ చంద్రబోస్ ధ్వజమెత్తారు.‌ శ్రీ జగన్‌కు బెయిల్ వచ్చే సమయంలోనే బాబు బస్సు యాత్రను అర్ధంతరంగా మధ్యలోనే ఆపేసి ‌హఠాత్తుగా ఢిల్లీ వెళ్లాల్సిన అవసరమేమిటని ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లి శ్రీ జగన్మోహన్‌రెడ్డికి బెయిల్‌ను రాకుండా అడ్డుకునే నీచ ప్రయత్నానికి ఒడిగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడిని శ్రీ జగన్ ఫోబియో పట్టి పీడిస్తోందన్నారు.

‌‘ఢిల్లీలో కాంగ్రెస్ నేతలతో రహస్య మంతనాలు జరిపి‌ శ్రీ జగన్ బెయిల్‌ను అడ్డుకోవాలనే ఏకైక ఎజెండా చంద్రబాబుది. అందు కోసం కాంగ్రెస్ అధిష్టానంతో చీకటి రాజకీయాలు చేయటం, ‌టిడిపి ఎంపిలను కాంగ్రెస్‌ పెద్దల వద్దకు పంపడం ఆయనకు బాగా తెలుసు. ఢిల్లీలో కుతంత్ర రాజకీయాలకు తెర లేపడం బాబుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. కాంగ్రెస్‌తో ఆయన కుమ్మక్కును ప్రజలు గమనిస్తున్నారు’ అని సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు.

చంద్రబాబు తనతో అర్ధరాత్రి మంతనాలు జరిపారంటూ కాంగ్రెస్‌కు చెందిన కేంద్ర మంత్రి చిదంబరం స్వయంగా పార్లమెంటులో బయటపెట్టారని బోస్ గుర్తు చేశారు. కానీ ఆయ‌నను ఎందుకు కలిసిందీ ఇంతవరకూ చంద్రబాబు వివరణ ఇవ్వలేదన్నారు. ‘చిదంబరంతో పాటు సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్, కర్ణాటక గవర్న‌ర్ హె‌చ్ఆర్ భరద్వాజ్, రేణుకా చౌదరి తదితరులను ‌చంద్రబాబు రహస్యంగా కలిసి ఏం మాట్లాడారో ప్రజలకు ఇప్పటికైనా చెప్పాలి. తనపై ఉన్న ఐఎంజీ, ఎమ్మార్, ఏలేరు, మద్యం తదితర కుంభకోణాలను కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు ఇలా చేస్తున్నార'ని సుభాష్‌ చంద్రబోస్‌ ఆరోపించారు.

రాష్ట్రంలో శ్రీ జగన్మోహన్‌రెడ్డి ప్రభంజనాన్ని ఎదుర్కోవాలంటే తన బలం చాలడం లేదని భావించి కాంగ్రెస్‌తో కుమ్మక్కు రాజకీయాలకు చంద్రబాబు పాల్పడుతున్నారని విమర్శించారు. విపక్ష నేతగా ఉంటూ అధికార పక్షంతో కుమ్మక్కవడం ప్రపంచ రాజకీయ చరిత్రలో ఒక్క బాబుకే సాధ్యమైంది అని ఎద్దేవా చేశారు. ‘కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో టిడిపి ఓట్లను కాంగ్రెస్‌కు బదిలీ చేయించడం నిజం కాదా? చిత్తూరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు కనీసం అభ్యర్థిని కూడా పోటీకి పెట్టలేదు. కాంగ్రెస్‌ సర్కారును అవిశ్వాస తీర్మానం బారి నుంచి కాపాడిందీ బాబేనని అందరికీ తెలుసు. ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తున్నది వైయస్ఆర్‌ కాంగ్రెస్ మాత్రమే. చిరంజీవి తన పార్టీని కాంగ్రె‌స్‌కు హోల్‌సేల్‌గా అమ్మితే బాబు రిటైల్‌గా అమ్ముతున్నారు’ అని దుయ్యబట్టారు. సీమాంధ్రలో బస్సుయాత్ర చేసిన చంద్రబాబు, సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నానని ఎందుకు చెప్పలేదని బోస్ ప్రశ్నించారు. ‌చంద్రబాబుకు అసలు నైతిక విలువలే లేవన్నారు. రాష్ట్రాన్ని విడదీయండంటూ లేఖ ఇచ్చి, యాత్రలు చేయటం సిగ్గుచేటన్నారు.

Back to Top