ఫ్లోరోసిస్ వ్యాధి పీడితుల‌కు షర్మిల భరోసా

సరంపేట (నల్గొండ జిల్లా), 10 ఫిబ్రవరి 2013: ఫ్లోరోసిస్‌ వ్యాధి బారిన పడి అగచాట్లు పడుతున్న నల్గొండజిల్లా వాసులకు అండగా నిలుస్తామని శ్రీమతి షర్మిల హామీ ఇచ్చారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలం సరంపేటలో ఆదివారం సాయంత్రం ఆమె మహిళలు, ఫ్లోరైడ్‌ బాధితులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, ఫ్లోరోసిస్‌ బాధితులు చెప్పిన కష్టాలను ఆమె శ్రద్ధగా విన్నారు.

తాము తాగే నీటిలో ఫ్లో‌రైడ్ అధికంగా ఉన్న కారణంగా తమకు ఎదురవుతున్న సమస్యల గురించి బాధితులు శ్రీమతి షర్మిల వద్ద మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల మాట్లాడుతూ.. ఫ్లోరోసిస్ బాధితులకు ఇస్తున్న పెన్షన్‌ రూ.500 నుంచి రూ.2‌,000కు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జగనన్న నేతృత్వంలో త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని శ్రీమతి షర్మిల వారికి భరోసా ఇచ్చారు. జగనన్న అధికారంలోకి వస్తే ఫ్లోరైడ్ బాధితులకు రూ.2‌,000 పింఛనుగా అందిస్తారని ఆమె హామీ ఇచ్చారు. ఫ్లోరోసిస్‌ పీడిత గ్రామాలకు కృష్ణా జలాలను అందించే పథకాన్ని తప్పకుండా పూర్తిచేస్తామని శ్రీమతి షర్మిల తెలిపారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాల కోసం రూ. 9 కోట్లు మాత్రమే ఖర్చుచేశారని, అదే మహానేత డాక్టర్‌ వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ళలోనే 375 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి 450 గ్రామాలకు కృష్ణా జలాలు సరఫరా చేశారని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. వైయస్‌ బ్రతికి ఉంటే నల్గొండజిల్లాలోని మిగిలిన 550 గ్రామాలకు కూడా నీళ్ళు వచ్చేసేవి అన్నారు.

కాగా, తమ రాజన్న కూతురు శ్రీమతి షర్మిల తమ గ్రామానికే నడిచి వస్తుండడంతో చూడడానికి మహిళలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆదివారంనాటి సాదచాత్రలో మాజీ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, ఎమ్మెల్యే అకేపాటి అమరనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.
Back to Top