ఫిక్సింగులకు మారుపేరు చంద్రబాబు

హైదరాబాద్, 18 మే 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో అభివృద్ధికి  మారుపేరైతే...టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకూ, ఫిక్సింగ్లకూ మరోపేరని వైయస్ఆర్  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి ధర్మాన ప్రసాదరావుపై చంద్రబాబు ఇప్పటికిప్పుడు మాట్లాడటం వెనక ఆంతర్యమేటని ప్రశ్నించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను బర్తరఫ్ చేయాలన్న ఆకస్మిక డిమాండ్  ఎందుకొచ్చిందన్నారు. కాంగ్రెస్ హైకమాండ్‌ డైరెక్షన్‌లో చంద్రబాబు కథ నడుపుతున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.

ఈ విషయాలన్నీ తాము తగిన ఆధారాలతోనే చెబుతున్నామన్నారు. కాంగ్రెస్, టీడీపీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరినట్లు స్పష్టంగా బయటపడిందని ఆయన పేర్కొన్నారు. ఆ రెండు పార్టీలు ప్రజలకు క్షమాపణ  చెప్పాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తాము కాంగ్రెస్‌తో కలుస్తామని చంద్రబాబు నేరుగా అంగీకరించొచ్చు కదా  ప్రశ్నించారు. ప్రతి సందర్భంలోనూ టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు వాస్తవం కాదా అని శ్రీకాంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.  చంద్రబాబు లోక కళ్యాణం కోసంపాటు పడే వ్యక్తా అని ఎద్దేవా చేశారు. మీడియా సమావేశం పూర్తి పాఠం..

ఇటీవలి కాలంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళివచ్చనప్పటినుంచి కాంగ్రెస్ హైకమాండ్ రాగాన్ని ఆలపిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ పాలక కాంగ్రెస్ పార్టీతో అనేక సందర్భాలలో కలిసి పనిచేసిందని ఇప్పటికే తాము చెప్పినదానికి ఇది తాజా ఉదాహరణని ఆయన పేర్కొన్నారు.

కళంకిత మంత్రుల గురించి ఇంతవరకూ ఎక్కడా ప్రస్తావించని చంద్రబాబు అకస్మాత్తుగా తన గళాన్ని వారికి వ్యతిరేకంగా విప్పారన్నరు. గవర్నరు కలిసి ఆ మంత్రులను తొలగించాలని కోరడం, రాష్ట్రపతిని కలవాలని ప్రయత్నాలు ప్రారంభించడం ఇందుకు తార్కాణాలన్నారు. ఈ మంత్రుల గురించి ఆయన అసెంబ్లీ సమావేశాల్లో కూడా మాట్లాడని విషయాన్ని శ్రీకాంత్ రెడ్డి గుర్తుచేశారు. ఢిల్లీ హైకమాండ్ సూచనల మేరకు టీడీపీ నడుస్తోందనడానికి ఇంతకు మించి సాక్ష్యం ఏమీ అవసరం లేదన్నారు.
2014 ఎన్నికలకు ఈ రెండు పార్టీలు ఒక అవగాహనకు వచ్చిన అంశం కళంకిత మంత్రులపై మాట్లాడడం ద్వారా వెల్లడవుతోందన్నారు. తమిళనాడు తరహాలో టీడీపీ ఓట్లను కాంగ్రెస్‌కు లోక్ సభ ఎన్నికలు వేయించేలాగానూ, తదుపరి అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ ఓట్లు తమకు వచ్చేలా అవగాహనకు వచ్చాయన్నారు.  
ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిణామాలు ఈ అనైతిక అవగాహనకు నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. తాజాగా జరిగిన ఉప ఎన్నికలు, ఎమ్మెల్సే ఎన్నికలలో ఉమ్మడి శత్రువయిన శ్రీ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొవడానికి కాంగ్రెస్, టీడీపీలు చేతులు కలిపిన అంశం వెల్లడైందన్నారు.

కాంగ్రెస్, టీడీపీలు రెండూ ప్రజాస్వామ్య విలువను క్షీణింపచేస్తున్న విషయాన్ని గ్రహించిన ప్రజలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నిర్ద్వంద్వంగా నిలుస్తున్నారనే నిజం అనేక సందర్భాలలో రుజువైందనీ, ఇది కొనసాగుతుందనీ శ్రీకాంత్ రెడ్డి స్పష్టంచేశారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత కళంకిత మంత్రులను తొలగించాలని డిమాండు చేస్తుండగా, రాష్ట్ర నేతలు హైదరాబాద్-ఢిల్లీ మధ్య చక్కర్లు కొడుతున్నారనీ, తద్వారా కుట్రను పూర్తిస్థాయిలో అమలుచేస్తున్నారనీ తెలిపారు.
అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు కూడా టీడీపీ ఈ మంత్రుల అంశాన్ని లేవనెత్తడం గానీ, అవిశ్వాసాన్ని సమర్థించడం గానీ చేయలేదన్నారు. అలాగే పార్లమెంటు ఎఫ్‌డీఐల అంశంపై ఓటింగు జరిగినప్పుడు తన ఎంపీలను రాజ్యసభకు గైర్హాజరవడానికి అనుమతించిందనీ గుర్తుచేశారు. ఉప ఎన్నికలు, ఇతర పరిపాలన సంబంధమైన విషయాలలో కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కు వెల్లడైందన్నారు.

చంద్రబాబు నాయుడుపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఏ దర్యాప్తు సంస్థ జోక్యం చేసుకోకుండా ఉండడమే దీని వెనుక అసలు ఉద్దేశమని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి సహకరించి, తను లబ్ధిపొందడమే బాబు లక్ష్యమన్నారు. అలాగే శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలకు దూరంగా ఉంచాలనే లక్ష్యంతో ఆ రెండు పార్టీలు పనిచేస్తున్నాయన్నారు.

చంద్రబాబుకు విలువలు లేవనీ, పార్టీనీ, ముఖ్యమంత్రి పదవినీ, గండిపేట పార్టీ కార్యాలయాన్ని ఆయన తన స్వార్థానికి వాడుకుని ప్రయోజనం పొందారని శ్రీకాంత్ రెడ్డ పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అమలుచేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని తూర్పారపెట్టడం మాని, ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్ సూచనల మేరకు చంద్రబాబు నడుచుకుంటున్నారని మండిపడ్డారు. దీనివల్ల ఆయన అన్ని ఆరోపణలనుంచి విముక్తిపొందుతున్నారన్నారు.

ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ, ఢిల్లీ హైకమాండ్ తానా అంటే తందానా అంటున్న చంద్రబాబుకు దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ కుటుంబాన్ని విమర్శించే హక్కు లేదని స్పష్టంచేశారు. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడతారే తప్ప చంద్రబాబు నాయుడిలా రాజీ పడబోరని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.

Back to Top