ఉప ఎన్నికలు నిర్వహించాలి: తాజా మాజీలు

హైదరాబాద్, 12 జూన్‌ 2013:

అనర్హులుగా ప్రకటించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో తక్షణమే ఉప ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి తాజా మాజీ ఎమ్మెల్యేలు విజ్ఞప్తిచేశారు. సార్వత్రిక ఎన్నికలకు గడువు ఇంకా ఏడాది కాలం ఉన్నందున తమ నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధుల అవసరం ఉందన్నారు. ప్రజల పక్షాన నిలబ‌డేందుకే తాము తమ పార్టీల విప్‌లను వ్యతిరేకించి అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటు వేశామన్నారు. ఈ మేరకు వారంతా బుధవారంనాడు ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ఒక లేఖ రాశారు.

చంద్రబాబు, కిరణ్ కుమ్మక్కై ఉప‌ ఎన్నికలు జరగకుండా అడ్డుకుంటున్నారని వారు మండిపడ్డారు. ఉప ఎన్నికలు వస్తే తమకు డిపాజిట్లు కూడా దక్కే అవకాశం లేదనే కాంగ్రెస్‌, టిడిపిలు స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఉపఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్ళీ తామే ఘన విజయం సాధిస్తామని దీమా వ్యక్తం చేశారు.

చంద్రబాబు, కిరణ్, బొత్స‌కు దమ్ము, ధైర్యం ఉంటే ఎన్నికలు జరపాలని ఈసీకి లేఖ రాయాలని గుడివాడ నియోజకవర్గం తాజా మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని డిమాండ్ చేశారు. స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్, ‌టిడిపిలు స్పీకర్ వ్యవస్థను‌ కూడా వాడుకుంటున్నాయని వారు ఆరోపించారు.

‌అనర్హులుగా ప్రకటించిన 15 స్థానాల్లోనూ ఏ రెండు మూడు చోట్ల కూడా కాంగ్రెస్‌, టిడిపిలు డిపాజిట్లయినా తెచ్చుకునే పరిస్థితి లేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఉప ఎన్నికలు నిర్వహిస్తే.. ప్రజల్లో ఆ పార్టీల బలం ఎంత ఉందో తేటతెల్లం అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు రాసిన లేఖలో తాజా మాజీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, మద్దాల రాజేష్‌ కుమార్, గొట్టిపాటి రవికుమార్‌, జోగి రమేష్‌ తదితరులు సంతకాలు చేశారు.

తాజా వీడియోలు

Back to Top