జనంలో ఒక్కడు

–బాధల్లో తోడుంటూ..భరోసానిచ్చిన వైయస్‌ జగన్‌
– కర్నూలు జిల్లాలో ముగిసిన మొదటి విడత రైతు భరోసా యాత్ర
–ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు అండగా నిలిచిన వైయస్‌ఆర్‌సీపీ అధినేత
– వృద్ధులు, వికలాంగుల కష్టాల్లో పాలు పంచుకున్న జననేత 
– పొలాల్లోకి వెళ్లి రైతుల ఇబ్బందులు తెలుసుకున్న ప్రతిపక్ష నేత
– మల్లన్న దర్శనం, చర్చి, దర్గాల్లో ప్రార్థనలు 
–శ్రీశైలం నియోజకవర్గంలో ఆరు రోజుల పాటు పర్యటించిన వైయస్‌ జగన్‌
– ఊరూరా అపూర్వ స్వాగతం.. ఆప్యాయత పంచిన ప్రజలు

కర్నూలుః రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయ్యింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు. బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. రైతుల పంట రుణాలు బేషరత్తుగా మాఫీ చేస్తామని నాడు హామీ ఇచ్చారు. తీరా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రుణాలు మాఫీ చేయలేదు. దీనికితోడు వరుసగా మూడేళ్లు కరువే..కరువు. పంటలు పండక.. చేసిన అప్పులు తీర్చే దారి లేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలాంటి సమయంలో నేనున్నానని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసా యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్రను ఐదు విడతల్లో పూర్తి చేసిన వైయస్‌ జగన్‌..ఈ ఏడాది జనవరి 5వ తేదీ నుంచి కర్నూలు జిల్లాలో  చేపట్టిన మొదటి విడత రైతు భరోసా యాత్ర మంగళవారంతో ముగిసింది. జిల్లాలోని శ్రీశైలం నియోజకవర్గంలో ఆరు రోజుల పాటు పర్యటించిన ఆయన ప్రజలతో మమేకమయ్యారు. ఇంతవరకు ఆ స్థాయి నాయకుడు ఇంతగా ఒకే నియోజకవర్గంలో వారం రోజుల పాటు పర్యటించి అన్ని వర్గాల ప్రజలతో మమేకం కావడం బహుశా దేశ చరిత్రలో ఇదేనేమో. రైతు భరోసా యాత్రకు వచ్చిన జననేత వైయస్‌ జగన్‌కు గ్రామ గ్రామాన అనూహ్య స్పందన లభించింది. కుటుంబ సభ్యుల్లో ఒకరిగా ఆదరించిన తీరు.. వృద్ధులు, వికలాంగులు, రైతులు, కూలీలకు జీవితంపై భరోసా కల్పించగా.. అక్కాచెల్లెమ్మలను ఆశీర్వదిస్తూ.. యువతకు దిశేనిర్దేశం చేశారు. పల్లెల్లో పెద్ద ఎత్తున బాణసంచా పేలుస్తూ స్వాగతం పలకడం ఆయనకున్న జనాదరణకు అద్దం పట్టింది. మొత్తం పర్యటనలో మండుటెండలో.. రాత్రి పొద్దుపోయాక కూడా ప్రజలు బారులు తీరి స్వాగతించడం విశేషం.

కన్నీళ్లు తుడుస్తూ..కష్టాల్లో తోడుగా
 మూడేళ్ల చంద్రబాబు పాలనలో విసిగిపోయిన ప్రజలకు అండగా నిలిచేందుకు వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జనం వద్దకు కదిలాడు. అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు కర్నూలు జిల్లాలో రైతు భరోసా యాత్ర చేపట్టారు. శ్రీశైలం నియోజకవర్గంలోని వెలుగోడు, బండిఆత్మకూరు, మహానంది మండలాల్లో ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబ సభ్యుల కన్నీళ్లు తుడుస్తూ..వారి కష్టాల్లో తోడుగా నిలిచారు. అధైర్యపడొద్దు..అండగా ఉంటానని భరోసా కల్పించారు. 

యాత్ర సాగింది ఇలా..
ఈ నెల 5వ తేదీ నుంచి కర్నూలు జిల్లాలో రైతు భరోసా యాత్ర చేపట్టిన వైయస్‌ జగన్‌ ఏకధాటిగా ఆరు రోజుల పాటు ఒక్క శ్రీశైలం నియోజకవర్గంలోనే పర్యటించారు. శ్రీశైలం ప్రాజెక్టు పరిశీలనతో మొదలైన యాత్ర సున్నిపెంటలో రోడ్‌షోతో ముందుకు కదిలింది. 2015వ సంవత్సరంలో తెలుగు దేశం పార్టీ నేతల దాడిలో దారుణంగా హత్యకు గురైన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు వసంతరావు కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు. జనవరి 6న శ్రీశైల మల్లికార్జున స్వామిని వైయస్‌ జగన్‌ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి ప్రకాశం జిల్లా మీదుగా దోర్నాల చేరుకొని మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడ అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. నల్లమల అరణ్యంలో పర్యటించి చెంచులతో మాట్లాడారు. అనంతరం ఆత్మకూరు మండలంలోని వెంకటాపురం, కృష్ణాపురం, అమలాపురం మీదుగా రోడ్‌షో నిర్వహించారు. సాయంత్రం ఆత్మకూరు పట్టణంలోని గౌడ్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు పాలన తీరుపై నిప్పులు చెరిగారు. అనంతరం పట్టణంలోని ఇందిరానగర్‌ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, అక్కడికి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించారు. ఓదార్పు యాత్ర సందర్భంగా కరివేన గ్రామంలో వైయస్‌ఆర్‌ అభిమానులు ఏర్పాటు చేసుకున్న మహానేత విగ్రహాలను ఆవిష్కరించడం సాధ్యపడకపోవడంతో అక్కడికి వైయస్‌ జగన్‌ వెళ్లి మూడు విగ్రహాలను ఆవిష్కరించారు. అదే రోజు రాత్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి స్మృతివనాన్ని సందర్శించి మహానేతకు నివాళులర్పించారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జనవరి 7న వెలుగోడు మండలం వేల్పనూరు గ్రామం నుంచి మూడో రోజు యాత్రను ప్రారంభించిన వైయస్‌ జగన్‌ ముందుగా గ్రామంలోని అంకాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం గ్రామంలో రోడ్‌ షో నిర్వహించారు. మార్గమధ్యలో కేసీ కెనాల్‌ పరిశీలించారు. అబ్ధుల్లాపురం గ్రామ పొలిమేరల్లో వరి, మినుము పంటలను పరిశీలించి రైతులు, కూలీలతో మాట్లాడారు. నోట్ల రద్దు ప్రభావంపై ఆరా తీశారు. వెలుగోడు పట్టణంలోని వైయస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పించారు. అనంతరం బోయరేవుల గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు చాకలి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మోతుకూరు గ్రామంలో వరి రైతులతో మాట్లాడారు. జనవరి 8న వేల్పనూరు నుంచి నాలుగో రోజు యాత్ర ప్రారంభించిన వైయస్‌ జగన్‌ చిన్న దేవలాపురం, సంతజూటురు మీదుగా లింగాపురం గ్రామానికి చేరుకొని అక్కడ మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తరువాత జీసీ పాలెం, సింగవరం, కడమలకాల్వలో రోడ్‌షో నిర్వహించారు. ఐదో రోజు లింగాపురం గ్రామంలోని చర్చిలో ప్రార్థనల అనంతరం యాత్రను ప్రారంభించిన వైయస్‌ జగన్‌ బండి ఆత్మకూరు మండలంలో పర్యటించారు. ఓంకార క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అక్కడే ఉన్న చెంచులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వెంగళరెడ్డిపేటలో మహానేత వైయస్‌ఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం బి.కోడురు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు చాంద్‌బాషా కుటుబాన్ని పరామర్శించారు. అదే రోజు రాత్రి మహానంది మండలంలోని తిమ్మాపురం గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న  రైతు చిన్నస్వామి కుటుంబాన్ని ఓదార్చారు. ఆరో రోజు మహానంది మండలం నుంచి యాత్ర ప్రారంభించిన వైయస్‌ జగన్‌ మహానందీశ్వరాలయంలో ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం పసుపు రైతులతో మాట్లాడి పంట సాగు వివరాలు అడిగి తెలుసుకున్నారు. చివరిగా గాజులపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రతిపక్ష నేత మాట్లాడారు.  

బ్రహ్మరథం
వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రైతు భరోసా యాత్రలో భాగంగా ఏ గ్రామం వెళ్లినా జనం బ్రహ్మరథం పట్టారు. జననేతను చూసి తమ బాధలు చెప్పుకున్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో మోసపోయామని ప్రజలు ప్రతిపక్ష నేత వద్ద వాపోతున్నారు. ప్రతి గ్రామంలోనూ జగన్‌కు ఘన స్వాగతం పలుకుతూ..పూలవర్షం కురిపించారు. పర్యటనలో భాగంగా వైయస్‌ జగన్‌ పొలం గట్ల వెంట నడుస్తూ..రైతులు, కూలీలను పలకరిస్తూ..పంట సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు తెలుసుకుంటున్నారు.  జనంతో మాట్లాడుతూ..వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ..చిన్నారులను చెంతకు తీసుకొని లాలిస్తూ..యువతతో సెల్ఫీలు దిగుతూ ఇలా రోజంతా జనంలోనే వైయస్‌ జగన్‌ గడిపారు.  

చలించిన ప్రతిపక్ష నేత
కర్నూలు జిల్లాలో పర్యటించిన వైయస్‌ జగన్‌ ఆయా మండలాల్లో పంటల దుస్థితిని చూసి చలించిపోయారు. వరి, కంది, మినుము, మొక్కజొన్న, పసుపు పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. చెమ్మగిల్లిన కళ్లతో రైతులు మాట్లాడుతూ పంట సరిగా రాలేదని, తెగుళ్లతో పాటు గిట్టుబాటు ధర లేకపోవడంతో కనీసం కౌలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉందన్నారు.  రైతుల బాధలు తెలుసుకున్న వైయస్‌ జగన్‌ వారిని ఓదారుస్తూ మన ప్రభుత్వంలో రైతుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని భరోసానిచ్చారు. నడిచేందుకు వీలు కాని వృద్ధులు కూడా అతి కష్టం మీద కరల్ర సహాయంతో ఎదురొచ్చి జననేతను పలుకరించారు. వికలాంగులు కూడా ఆయనను కలిసి తమ కష్టాలను చెప్పుకున్నారు.  జననేతతో కరచాలనానికి యువత పోటీపడ్డారు. ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినా జనం కష్టాలు తెలుసుకునేందుకు వచ్చిన వైయస్‌ జగన్‌కు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ఆయన కూడా జనంలో ఒక్కడిగా మెలిగారు. ఇలాంటి నాయకుడు  యుగానికి ఒక్కరు పుడతారని, వైయస్‌ జగన్‌ జనంలో ఒక్కడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నాయకుడంటే ఇలా ఉండాలని వైయస్‌ఆర్‌సీపీ నేతలు కాలర్‌ ఎగురవేస్తున్నారు. దటీజ్‌ వైయస్‌ జగన్‌. 
 
Back to Top