జగన్ కోసం పోటెత్తిన జన ప్రవాహం

హైదరాబాద్ :

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో దారులన్నీ మంగళవారంనాడు చంచల్‌గూడ దిశగా సాగాయి. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన జనంతో మలక్‌పేట, చంచల్‌గూడ, సైదాబాద్, ఐఎస్ సదన్, డబీర్‌పురా పరిసరాలు ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయాయి. వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధినేత ‌శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి విడుదల సందర్భంగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు తరలివచ్చారు. 16 నెలల సుదీర్ఘ కాలం తర్వాత తమ మధ్యకు వస్తున్న ప్రియతమ నేతను కళ్లారా చూసుకునేందుకు, కరచాలనం చేసేందుకు చంచల్‌గూడ జైలు ముందు ఉదయం 8 గంటల నుంచే జనం భారీ సంఖ్యలో బారులు తీరారు.

ఉదయం 11 గంటల సమయానికే చంచల్‌గూడ జైలు ఎదురుగా ఉన్న ప్రాంతమంతా అభిమానులతో కిటకిటలాడిపోయింది. అభిమానుల తాకిడి పెరిగే కొద్దీ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. జైలు ప్రాంగణంలోకి ఎవరినీ రానీయకుండా ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. వాహనాలను జైలు ప్రాంగణానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే నిలిపివేశారు. ప్రజాప్రతినిధుల వాహనాలను కూడా అనుమతించకపోవడంతో వారంతా జైలు వరకూ నడిచి వచ్చారు. ప్రియతమ జననేత ఎప్పుడెప్పుడు బయటికొస్తాడా, ఎప్పుడు ఆయనతో కరచాలనం చేస్తామా అనే ఆరాటం అందరి ముఖాల్లో స్పష్టంగా కనిపించింది. ఎండ చండ్ర నిప్పులు చెరుగుతున్నా ఒక్కరు కూడా అంగుళమూ కదల్లేదు. తిండి, నీరూ కూడా పట్టించుకోకుండా జైలు గేటు వైపే దృష్టి సారించి నిలబడ్డారు. అక్కడ ఏ చిన్న అలజడి రేగినా జగనే వస్తున్నారంటూ కేరింతలు కొట్టారు. పెద్ద సంఖ్యలో వచ్చిన యువత తమ ముఖాలకు శ్రీ జగన్మోహన్‌రెడ్డి మాస్కులు ధరించి సందడి చేశారు.

జగనన్న బయటికి వచ్చిన వేళ :
అభిమాన జనం అసంఖ్యాక సంఖ్యలో ఎదురు చూస్తున్న సమయం. సరిగ్గా సాయంత్రం 3.55 గంటలకు తెల్లరంగుపై నీలం చారల చొక్కా వేసుకున్న శ్రీ జగన్మోహన్‌రెడ్డి జైలు నుంచి బయటికి వచ్చారు. లోపలి నుంచి జైలు ప్రధాన ద్వారం వరకూ శ్రీ జగన్‌ను వైయస్ఆర్‌ కాంగ్రెస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతా‌ప్‌రెడ్డి ఎత్తుకుని తీసుకొచ్చారు. పార్టీ మహిళా నేతలు జైలు గేటు వద్ద గుమ్మడికాయతో ఆయనకు దిష్టి తీశారు. శ్రీ జగన్ బయటికి రాగానే‌ అభిమానులు, పార్టీ శ్రేణులు దిక్కులు పిక్కటిల్లేలా జయజయ ధ్వానాలు చేశారు. పూలవర్షం కురిపించారు. ప్రవాహంలా ఆయన వైపు తోసుకెళ్లారు. అభిమానులందరికీ చిరునవ్వుతో అభివాదం చేస్తూ ముందుకు కదిలిన శ్రీ జగన్‌కు, జైలు గేటు నుంచి ఎదురుగా ఉన్న వాహనం వరకు వెళ్ళడానికి చాలా సమయం పట్టింది.

వాహనం ఫుట్‌బోర్డుపై నిలబడి చుట్టూ చూస్తూ శ్రీ జగన్ చేతులూపారు.‌ అభిమానులందరికీ రెండు చేతులూ జోడించి ఆప్యాయంగా అభివాదం చేశారు. చిరునవ్వుతో అందరినీ పలకరించారు. ఎట్టకేలకు భారీ పోలీసు భద్రత మధ్య శ్రీ జగన్ ‌వాహన శ్రేణి చంచల్‌గూడ నుంచి ముందుకు సాగింది. అడుగడుగునా అభిమాన జనం శ్రీ జగన్మోహన్‌రెడ్డికి నీరాజనాలు పట్టారు. పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులంతా వాహనాల పెకైక్కి కూర్చుని మరీ ప్రయాణించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు సైతం ఆయనతో కరచాలనం చేసేందుకు దారిపొడవునా పోటీలు పడడం విశేషం.

చంచల్‌గూడ నుంచి నల్లగొండ క్రాస్‌రోడ్సు, చాదర్‌ఘాట్, మొజాంజాహి మార్కెట్, గాంధీభవన్, నాంపల్లి, అసెంబ్లీ, లక్డీకాపూల్, ఖైరతాబాద్, తాజ్ డెక్కన్, ‌జివికె, నాగార్జున సర్కిల్, కెబిఆర్ పార్కు, జూబ్లీహి‌ల్సు చెక్‌పోస్టు, ఫిలింనగర్ రోడ్డు ‌వరకూ అడుగడుగునా ప్రజలు అభిమానంతో వెల్లువెత్తారు. అన్నిచోట్లా ఆగుతూ, అతి నెమ్మదిగా సాగుతూ ఐదున్నర గంటల తరువాత శ్రీ జగన్మోహన్‌రెడ్డి రాత్రి 9.30 గంటలకు లోటస్‌పాండ్‌లోని తన నివాసానికి చేరుకున్నారు.

చంచల్‌గూడ-చాదర్‌ఘాట్‌ :
చంచల్‌గూడ జైలు నుంచి చాదర్‌ఘాట్ ‌వరకూ అభిమానులు పెద్ద సంఖ్యలో రోడ్లకు ఇరువైపులా బారులు తీరారు. శ్రీ జగన్ కాన్వా‌య్‌పై అడుగడుగునా పూలవర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు. ‘పులివెందుల పులిబిడ్డ’, ‘ఎ.పి. కా షేర్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఛావ్‌ణీ చౌరస్తాలో కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్ సాంస్కృతిక విభాగం కళాకారులు ఆటపాటలతో అలరించారు. మొజాంజా‌హి మార్కెట్ చౌరస్తా వద్ద జన సందోహమే.‌ మార్కెట్ నుంచి బేగంబజార్, అఫ్జ‌ల్‌గంజ్ రోడ్లపైకి అభిమానులు భారీగా తరలివచ్చారు. రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ మంత్రి ముకేశ్ గౌ‌డ్ క్యాంపు కార్యాలయం సమీపంలో రోడ్డుపై పూలు, పండ్ల వ్యాపారులు, స్థానికులు టపాకాయలు కాల్చారు.‌ శ్రీ జగన్‌ను పూలమాలలతో సత్కరించారు. వారందరికీ శ్రీ జగన్‌ తన వాహనం దిగి అభివాదం చేశారు. ఆయనతో కరచాలనానికి అనేక మంది పోటీపడ్డారు. వాహనశ్రేణి గాంధీభవన్ సమీపానికి చేరుకోగానే గోషామహ‌ల్ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు నినాదా‌లు చేస్తూ స్వాగతం పలికారు.

లక్డీకాపూల్‌లో లంబాడీ నృత్యాలు :

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఖైరతాబాద్ నియోజకవర్గ‌ం నాయకురాలు విజయారెడ్డి ఆధ్వర్యంలో మధ్యాహ్నం మూడు గంటల నుంచే పార్టీ నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో లక్డీకాపూల్ బస్టా‌ప్ వద్దకు చేరుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై లంబా‌డీ మహిళలు నృత్యాలతో ఆకట్టుకున్నారు. సాయంత్రం 6.10 నిమిషాలకు అక్కడికి చేరుకున్న శ్రీ జగన్ కారు నుంచి అభిమానులకు అభివాదం చేశారు. విజయారెడ్డి మహిళలతో కలిసి ‌ఆయనకు హారతిచ్చి ఘన స్వాగతం పలికారు. లక్డీకాపూ‌ల్ పాత ఫ్లైఓవర్ మీదుగా భారీ ర్యాలీగా సాయంత్రం 6.45 గంటలకు‌ శ్రీ జగన్ ఖైరతాబా‌ద్ చౌరస్తాకు చేరుకున్నారు.

పంజాగుట్టలో కోలాహలం‌:
శ్రీ జగన్మోహన్‌రెడ్డి పంజాగుట్ట చౌరస్తాకు వస్తున్నారన్న సమాచారంతో సాయంత్రం 4 నుంచే పెద్ద ఎత్తున అభిమానులు అక్కడ ఉన్న మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్దకు చేరుకున్నారు. విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వేల సంఖ్యలో అభిమానులు బ్యాండు మేళాలతో నృత్యాలు చేస్తూ, బాణసంచా కాలుస్తూ సందడి చేశారు. పంజాగుట్ట ఫ్లైఓవర్ అభిమానుల‌తో నిండిపోయింది. ఫ్లై ఓవర్ మీద‌ నుంచి తమ ప్రియతమ నేతను చూడవచ్చని వారంతా భావించారు. చివరికి శ్రీ జగన్ అక్కడికి రావడం లేదని తెలిసి వారంతా నిరాశ చెందారు. చెన్నారెడ్డి విగ్రహం మీదుగా కాన్వా‌య్ ముందుకు‌ సాగడంతో అభిమానులు అనుసరించారు. నాగార్జున సర్కిల్ సమీపంలోని ఫ్లై ఓవ‌ర్‌ పై నుంచి అభిమానులు కాన్వాయ్‌పై పూలవర్షం కురిపించారు.

మొరాయించిన బుల్లెట్‌ ప్రూఫ్ ‌వాహనం :

నాగార్జున సర్కిల్ నుంచి కొద్దిగా ముందు‌కు వెళ్లగానే పంజాగుట్ట శ్మశానవాటిక వద్ద శ్రీ జగన్ బుల్లెట్ ప్రూ‌ఫ్ స్కార్పియో వాహనం మొరాయించింది. ‌అక్కడ ఆయన మరో స్కార్పియోలోకి మారారు. టివి 9, హెరిటేజ్ సంస్థల ముందు నుంచి శ్రీ జగన్‌ వాహన శ్రేణి వెళ్లినపుడు ఆయా సంస్థల ఉద్యోగులు కేరింతలు కొడుతూ ఆయనకు అభివాదం చేశారు. నాగార్జున సర్కిల్ నుంచి లోట‌స్‌పాండ్ వరకు దుకాణాల నిర్వాహకులు‌ శ్రీ జగన్ రాక కోసం ఆసక్తిగా నిరీక్షించారు. దుకాణాల బయటకు వచ్చి అభివాదం చేశారు. ‌కెబిఆర్ పా‌ర్కు చౌరస్తాలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ నాయకుడు పేర్ని నాని శ్రీ జగన్ కాన్వా‌య్‌కి ఘన స్వాగతం పలికారు.

జూబ్లీహిల్సు చౌరస్తా కూడా శ్రీ జగన్‌ రాక సందర్భంగా జనసంద్రంగా మారింది. సరిగ్గా 9.30 గంటలకు శ్రీ జగన్ లోట‌స్‌పాండ్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. అభిమానుల పూలవర్షం, మహిళల నృత్యాలు, యువకుల కేరింతల మధ్య 'జై జగన్' నినాదాలు కూడా మిన్నంటాయి. శ్రీ జగన్‌కు బాల్కనీ నుంచి కుటుంబ సభ్యులు అభివాదం చేశారు.

చంచల్‌గూడ జైలు వద్దకు వచ్చిన నాయకులు :
ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, గొల్ల బాబూరావు, బి.గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, టి. బాలరాజు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కె.శ్రీనివాసులు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమరనాథరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, దేవగుడి నారాయణరెడ్డి, దేశాయ్ తిప్పారెడ్డి, మాజీ‌ ఎమ్మెల్యేలు పిల్లి సుభాష్ చంద్రబోస్, వై.బాలనాగిరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖ‌ర్‌రెడ్డి, జోగి రమేష్, కొడాలి నాని, పేర్ని నాని, గొట్టిపాటి రవికుమార్, మద్దాల రాజేష్ కుమార్, బూచేపల్లి శివప్రసాదరెడ్డి, సామినేని ఉదయభాను‌, ఇతర నాయకులు హెచ్‌ఏ రెహ్మాన్, కొల్లి నిర్మల, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి, ఎంవిఎస్ నాగిరెడ్డి, కోటింరెడ్డి విన‌య్‌రెడ్డి, బి.జనార్ధన్‌రెడ్డి, ఆదం విజయ్‌కుమార్, కాలేరు వెంకటేష్, దేప భాస్కర్‌రెడ్డి, కొలను శ్రీనివాసరెడ్డి, ఈసీ శేఖర్‌గౌడ్, కొండా రాఘవరెడ్డి, కె.సురేశ్‌రెడ్డి, ధన్‌పాల్‌రెడ్డి తదితరులు జైలు వద్దకు వచ్చారు. బంధువులు మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి, కడప మాజీ మేయ‌ర్ పి.రవీంధ్రనా‌థ్‌రెడ్డి, సోదరుడు వైయస్ అవినా‌ష్‌రెడ్డి, యశ్వంత్‌రెడ్డి తదితరులు మధ్యాహ్నమే జైలు వద్దకు చేరుకున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top