విభజనను ప్రజలు అంగీకరించరు: విజయమ్మ

న్యూఢిల్లీ 27 సెప్టెంబర్ 2013:

అన్నదమ్ముల్లా ఉన్న తెలుగువారి మధ్య అంతరం పెంచారని, విభజనను తెలుగుప్రజలు ఎప్పటికీ అంగీకరించబోరని.. రాష్టాన్ని సమైక్యంగా ఉంచాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్  విజయమ్మ డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్తో ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు శుక్రవారం చేపట్టిన ధర్నాకు ఆమె హాజరయ్యారు.  ధర్నాకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ యూపీఏ సర్కారు మీద తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  ప్రజలకు జవాబు చెప్పకుండా విభజన ఎలా చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నిర్ణయంతో జనం ఇక్కట్లు పడుతున్నారని, దాదాపు 60 రోజులుగా సాగుతున్న సమ్మె వల్ల సీమాంధ్రతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మీద ప్రభావాన్ని చూపుతోందని తెలిపారు.

ఇక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీడబ్ల్యూసీ నిర్ణయానికి ముందుగా సమైక్య వాదనను వినిపించలేదన్నారు.  ఇప్పుడు మాత్రం విభజన వద్దంటూ నాటకాలాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీల నుంచి ఒక్కరు కూడా తమ పదవులకు రాజీనామాలు చేయలేదని శ్రీమతి విజయమ్మ చెబుతూ,  కొత్త పార్టీ పెట్టి పోటీ చేస్తామంటున్నారని మండిపడ్డారు. పదవులపై తప్ప సమైక్యంపై వారికి చిత్తశుద్ధి లేదన్నారు.  అసలు చంద్రబాబు లేఖ వల్లే కేంద్రం ధైర్యం చేయగలిగిందని ఆమె చెప్పారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను ఎందుకు విభజించలేదని, కేవలం తెలుగువారిని మాత్రమే ఎందుకు చీలుస్తున్నారని నిలదీశారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలను సమైక్య రాష్ట్రం విషయమై ప్రజలు నిలదీయాలని శ్రీమతి విజయమ్మ పిలుపునిచ్చారు.
అన్యాయమైన నిర్ణయాలు తీసుకుంటే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని విజయమ్మ స్పష్టం చేశారు. ఆంటోనీ కమిటీతో ఎలాంటి న్యాయం చేకూరదని స్పష్టంచేశారు.  హైదరాబాద్‌లో కలిసికట్టుగా జీవిస్తున్న తమను ఇప్పుడు వెళ్లిపోమంటే ఎలాగని ప్రశ్నించారు. పోలవరానికి ఎక్కడి నుంచి నీళ్లు ఇస్తారు? విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాలి? అని నిలదీశారు. రాష్ట్ర బడ్జెట్‌లో సింహభాగం హైదరాబాద్‌ నుంచే వస్తోందన్న విషయాన్ని కూడా ఆమె గుర్తుచేశారు.

Back to Top