ప్ర‌జ‌లు మాత్రం వైఎస్ జ‌గ‌న్ వెంటే..!

పుత్తూరు(చిత్తూరు జిల్లా) :   వైఎస్సార్సీపీ నుంచి స్వార్థ‌ప‌రులు మాత్ర‌మే టీడీపీకి వెళుతున్నార‌ని, ఇటువంటి వారు ఫిరాయించినా పార్టీకి న‌ష్టం లేద‌ని చిత్తూరు జిల్లా పార్టీ అధ్య‌క్షుడు, గంగాధ‌ర నెల్లూరు ఎమ్మెల్యే కే నారాయ‌ణ స్వామి అభిప్రాయ ప‌డ్డారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి వెంట జనం ఉన్నారని, కొంద‌రు పార్టీ నుంచి వెళ్లిపోయినా  నష్టం లేదని ఆయ‌న‌ అన్నారు. 
  పార్టీని వీడిన వారంతా డబ్బు కోసమే వెళ్లారని, మైసూరారెడ్డి కూడా ఆ కోవకు చెందినవారేనని ఆరోపించారు. ఆస్తులను కాపాడుకునేందుకే  మైసూరారెడ్డి పార్టీని వీడారని విమర్శించారు. ఆయనకు ప్రజలకంటే పదవులపైనే మక్కువ అని ఆయన చరిత్రను పరిశీలిస్తే ఇది అర్థం అవుతుందన్నారు. ఎన్నికల ముందు వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందనే భావనతో ఆయనే పార్టీలోకి వచ్చారని గుర్తుచేశారు. జగన్‌మోహన్ రెడ్డి డబ్బు మనిషి అని మైసూరారెడ్డి ఆరోపణలు చేయడాన్ని నారాయణస్వామి ఖండించారు. 
 చంద్రబాబు ప్రలోభాలను నమ్మి వెళ్లిన వారు రెంటికీ చెడ్డ రేవడిలా మిగిలిపోతారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రజల దృష్టిని మరల్చడానికే చంద్రబాబు రాజకీయ కుయుక్తులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. అందులో భాగంగానే ప్రతిపక్ష ఎమ్మెల్యేల కొనుగోలు వంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు దిగుతున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో జనమే జగన్‌కు పట్టం కడతారని అన్నారు.
Back to Top