'అసంతృప్తి మిగిల్చిన టీడీపీ ఏడునెలల పాలన'

గుంటూరు: రాష్ట్రంలో టీడీపీ ఏడు నెలల పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, టీడీపీ అరాచకాలు అధికమయ్యాయని, వైఎస్సార్ సీపీ  గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి అన్నారు. పార్టీ అధికార ప్రతినిధి అంబటిరాంబాబుతో కలిసి స్థానిక నేత కత్తెరపు రామ్‌గోపాల్‌రెడ్డి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తాను పూర్తిగా మారిపోయానని మాయ మాటలు చెప్పి అధికారం చేజిక్కుంచుకున్న చంద్రబాబు చేసిన వాగ్దానాలు మరిచిపోయారని విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటున్నా వాస్తవానికి అవి సక్రమంగా అమలు కాక రైతులు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వితంతువులకు, వృద్ధులకు పింఛన్లు ఐదు రెట్లు చేస్తానన్న చంద్రబాబు ఉన్న ఫించన్లు తొలగించారన్నారు. ప్రతి గ్రామంలోనూ ఎంతోమందికి వృద్ధాప్య పింఛన్లు నిలిచిపోయి పండుటాకులు అలమటిస్తున్నారని అన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ జపాన్, సింగపూర్ అంటూ మాటలతో రాజధాని నిర్మిస్తున్నారు తప్ప ఇప్పటి వరకు చేతల్లో చూపించిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కల్లబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిన చంద్రబాబు రైతులను గాలికి వదిలివేశారన్నారు. సమావేశంలో  పిడుగురాళ్ల, రాజుపాలెం జెడ్పీటీసీలు వీరభద్రుని రామిరెడ్డి, మర్రివెంకటరెడ్డి, మండల ఫ్లోర్‌లీడర్ తాటికొండ చిన ఆంజనేయులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Back to Top