జనం నీ పాలన చూసి నవ్వుతున్నారు

– పబ్లిసిటీ పక్కనపెట్టి సంక్షేమానికి సమయం కేటాయించు
– భయపెట్టి చేరికలు ప్రోత్సహించడం అభివృద్ధా..?
– నీ సొంత డబ్బాతో రాష్ట్రానికి అన్యాయం జరిగింది
– ప్రజల మద్దతు నీకుంటే ఎన్నికల్లో గెలిచి చూపించు
– చంద్రబాబుపై వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్ధసారధి ధ్వజం

విజయవాడ: వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకుంటున్న చంద్రబాబు పదవుల్లో లేనివారికి కూడా కండువాలు కప్పి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు తమ పార్టీలో చేరినట్టు మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధికార కొలుసు పార్ధసారధి ధ్వజమెత్తారు. జనం నవ్వుతారన్న కనీసం ఇంగితం లేకుండా దిగజారిపోయి పబ్లిసిటీ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. విజయవాడలో జరిగిన  విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీలో చేరినవారంతా సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారారే తప్ప ఏ ఒక్కరూ మా పార్టీపై కానీ, మా  అధినేత వైయస్‌ జగన్‌పై నమ్మకం లేక చేరినట్టు చెప్పారా అని ప్రశ్నించారు. పార్టీ మారినవారంతా చేరడానికి వారం ముందు వరకూ చంద్రబాబు పాలనను విమర్శించిన వారేనని గుర్తు చేశారు. 

పార్టీ మారింది ఇద్దరు ఎంపీటీసీలే 
ఉప్పులేటి కల్పనతోపాటు ఇద్దరు ఎంపీటీసీలు మాత్రమే  టీడీపీలో చేరితే వార్తాపత్రికల్లో మాత్రం పది మంది చేరినట్లు అసత్య ప్రచారం చేసుకోవడం చంద్రబాబు దౌర్భాగ్యమన్నారు. పామ్రరు, పెదపారిపూడి ఎంపీటీసీలు మాత్రమే ఉప్పులేటి కల్పన వెంట టీడీపీలో చేరారని మిగతా అందరూ వైయస్‌ఆర్‌సీపీలో కొనసాగుతారని స్పష్టం చేశారు. వారంతా పార్ధసారథితోపాటు ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేలకే ముఖ్యమంత్రి అపాయింట్‌ దొరకడం కష్టమవుతుందని ఇప్పుడు పార్టీ మారి టీడీపీలో చేరే ఎమ్మెల్యేలు చేసేదేమీ ఉండదన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు, బెదిరింపుల నుంచి భయపడి పార్టీ మారుతున్నారే తప్ప నియోజకవర్గ అభివృద్ధి అని చెప్పడం ఒట్టిమాటేనని కొట్టి పారేశారు. ఒక్కొక్క ఎమ్మెల్యేను 20 నుంచి 30 కోట్లు పెట్టి కొనుగోలు చేసే డబ్బు ఆయనకు ఎక్కడిదని పార్ధసారథి ప్రశ్నించారు. నీతి నిజాయితీ మరో పేరును, నిప్పు లాంటి మనిషిని అని చెప్పుకునే చంద్రబాబు రాజ్యాంగ విరుద్ధంగా ప్రోత్సహిస్తున్న చేరికలపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. నిన్నటి వరకు ద్రోహిలా కనిపించిన చంద్రబాబు ఉన్నట్టుండి ఎలా పుణీతుడయ్యాడో తనకేమాత్రం అర్ధం కావడంలేదని కల్పనను ఉద్దేశించి పార్ధసారథి మాట్లాడారు. పట్టిసీమను 9 నెలల్లో పూర్తిచేశాడని చెప్పుకోవడం పెద్ద జోక్‌గా ఉందని ఎద్దేవా చేశారు. 

ఏం అభివృద్ధి చేశావో శ్వేతపత్రం రిలీజ్ చేయ్
చంద్రబాబు తన మూడేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిపై ప్రజలకు వివరించాలని శ్వేతపత్రం విడుదల చేయాలని పార్ధసారథి డిమాండ్‌ చేశారు. ఇంతవరకు ఏయే పనులు పూర్తయ్యాయి.. ఎంతమేర పెండింగ్‌లో ఉన్నాయి.. ఎప్పటి లోపు పూర్తి చేస్తారు. రానున్న కాలంలో ఏమేం చేయబోతున్నారో వివరించాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. ఏపీ జీడీపీ దేశాన్ని మించిపోయిందని ప్రచారం చేసుకుంటన్న చంద్రబాబు ఆదాయం ఎందుకు పెరగలేదో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. 2014–15లో 10.7, 2015–16లో 12.23 జీడీపీతో ఏపీ దూసుకుపోతుందన్న చంద్రబాబు 7శాతం జీడీపీ ఉన్న కేంద్రం ఆదాయం 30శాతం పెరిగితే 12 శాతం జీడీపీ ఉన్న ఏపీ ఆదాయం 45శాతం పెరగాలి కదా అని ప్రశ్నించారు. అలాంటప్పుడు ఏపీ పేద రాష్ట్రం అని ప్రచారం ఎందుకు చేసుకుంటున్నారు..  సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలన్నారు. చంద్రబాబు చేస్తున్న జీడీపీ పబ్లిసిటీ పిచ్చితో  కేంద్రం నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. జీడీపీలంటూ జనానికి అర్ధం కాని భాషలో మాట్లాడే బాబు కనీసం అందులోనైనా వాస్తవాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

పోలవరంలో ఎన్ని ఫేజ్‌లున్నాయి..?
పోలవరం ప్రాజెక్టులో మొత్తం ఎన్ని ఫేజ్‌లున్నాయో చెప్పాలని పార్ధసారథి డిమాండ్‌ చేశారు. ఏ ఫేజ్‌లో ఏమేం పనులు చేస్తారు.. ఒక్కో ఫేజ్‌కు ఎంత సమయం పడుతుందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తామన్న మాటలు వాస్తవమేనా అని ప్రశ్నించారు. పోలవరం కోసం 2900 కోట్లు నాబార్డు నిధులు వస్తున్నాయని చంకలు గుద్దుకున్న ముఖ్యమంత్రి వారు కేవలం 1800 కోట్లు విదిలించి చేతులు దులుపుకుంటే వెంటనే ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని నిలదీయడానికి సమయం లేదుకానీ ఎమ్మెల్యేల చేరికలను ప్రోత్సహించి గంటలకొద్దీ మైకు పట్టుకుని డబ్బా కొట్టుకోవడానికి మాత్రం తీరిక దొరికిందా అన్ని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేసేలా ఉంటే పురుషోత్తం పట్నం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఎందుకు ప్రారంభించారో ప్రజలకు తెలియజెప్పాలని.. ఒక్క సంవత్సరం ఉంటే స్కీమ్‌ కోసం 1800 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు అనుమతులు, అన్ని పనులు దాదాపు పదేళ్ల కిందటే మహానేత హయాంలోనే పూర్తయ్యాయని పేర్కొన్నారు. 

దమ్ముంటే ఎన్నికలకెళ్దాం రా..
సహేతుకంగా లేని సర్వేలు చేయించి 80 శాతం మంది ప్రజలు మా మీద నమ్మకం ఉన్నామని ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబుకు దమ్ముంటే పార్టీలో చేరిన 20 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని డిమాండ్‌ చేశారు. 175 స్థానాల్లో గెలుపు మాదే అని ప్రచారం చేసుకోవడం కాదు ఎన్నికలకు వెళ్లి నిరూపించుకోవాలని సవాల్‌ విసిరారు. పక్కోడి చేలో పండిన పంటను తీసుకొచ్చి నీలో చేలో వేసుకున్నంత మాత్రాన నీవు పండించినది కాదని ఎద్దేవా చేశారు. మీ పార్టీ నుంచి జడ్పీటీసీ సభ్యులకు, మహిళలకే టీడీపీలో గౌవరం లేకపోతే పార్టీ మారిన వారి స్థానం ఏంటో అర్ధమవుతుందని పేర్కొన్నారు. మీ పార్టీ నుంచి గెలిచిన జానీమూన్‌కు మీ సహచర మంత్రి నుంచే ప్రాణహాని ఉందని చెబుతుంటే అలాంటిది 80శాతం మంది ప్రజలు మీకు మద్ధతుగా ఉన్నారని ప్రచారం చేసుకోవడానికి సిగ్గుండాలని విమర్శించారు. నియోజకవర్గానికి 200 కోట్లు అభివృద్ధి నిధులు ఇస్తామని 50 కోట్లు జేబుల్లోకి వేసుకోవచ్చని చంద్రబాబు ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. కనీసం సీసీ రోడ్లు వేయడానికి కూడా డబ్బుల్లేక ఎస్సీ కార్పొరేషన్‌ నిధులు దీనికి మళ్లిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు అనైతిక, సిగ్గుమాలిన రాజకీయాలు మానుకుని ఇప్పటికైనా ప్రజా సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. వైయస్‌ఆర్‌సీపీ మీద, మా నాయకుడు వైయస్‌ జగన్‌ మీద నమ్మకంతో ఎవరైనా వస్తున్నామంటే ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నామే తప్ప ఎవర్నీ ప్రలోభాలకు గురిచేయడం లేదని అది మా సంస్కృతి కాదని పార్ధసార«థి స్పష్టం చేశారు. 
Back to Top