ప్రజల్ని, దేవుడ్ని నమ్ముకొన్నా: వైఎస్ జగన్

  •  ప్రజల గొంతు నొక్కాలన్నది చంద్రబాబు ప్రయత్నం
  • అందుకే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అవినీతి సొమ్ముతో లాక్కొంటున్నారు
  •  త్వరలోనే దేవుడు, ప్రజలు తగిన బుద్ది చెబుతారు
  •  నెల్లూరు సభలో వైఎస్ జగన్ ఉద్వేగభరిత ప్రసంగం
  • నెల్లూరు: ఎప్పుడూ నాయకుల్ని నమ్ముకోలేదని, ప్రజలు..దేవుడ్ని మాత్రమే
    నమ్ముకొన్నానని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఉద్ఘాటించారు.
    ప్రజల చల్లటి దీవెనల సాయంతో చంద్రబాబు తో మరింత బలంగా పోరాడుతానని ఆయన అన్నారు.
    నెల్లూరు నగరంలోని కస్తూరి దేవి గార్డెన్స్ లో సీనియర్ నేత ఆనం విజయకుమార్ రెడ్డి,
    అనుచరులతో సహా వైఎస్సార్సీపీ లో చేరిన సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడారు. ఆయన
    ప్రసంగం ఆయన మాటల్లోనే..

           నెల్లూరు రూరల్ నియోజక వర్గం
    నుంచి ఆనం విజయన్న చేరికతో ..మొన్ననే ప్రలోభాలు, అవినీతి సొమ్ములకు ఆశపడి పార్టీ
    ఫిరాయించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు బుద్ధి వస్తుంది. ప్రతిపక్షం అంటే ప్రజల గొంతు.
    చంద్రబాబు పాలనలో అవస్థలు పడుతున్న ప్రజల గొంతు. అటువంటి గొంతును నొక్కేయాలని
    చంద్రబాబు సర్కారు ఆరాట పడుతోంది. ప్రజల తరపున కష్టపడుతున్న వారి  గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారు.  ఇతర పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను బాబు ప్రలోభ
    పెట్టి లాక్కొంటున్నారు. అవినీతి సొమ్ముతో కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తున్నారు.
    ఇప్పటికైనా చంద్రబాబుకి అర్థం కావాలి, ప్రలోభాలకు లొంగిపోయిన ఎమ్మెల్యేలకు అర్థం
    కావాలి.

    రాజకీయాల్లో గుణం ముఖ్యం

           రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజలు
    మన వైపు చూస్తుంటారు. అందుకే మనం రోల్ మోడల్స్ గా ఉండాలి. రాజకీయాల్లో ఉన్నవారికి
    రెండు గుణాలు ఉండాలి. ఒకటి క్యారెక్టర్ అంటే వ్యక్తిత్వం, రెండు క్రెడిబిలిటీ అంటే
    విశ్వసనీయత. రాజకీయ నాయకులకు ఈ రెండు గుణాలు ఉండాలి. ఇవి రెండూ లేకపోతే జనమే
    కాదు, ఆఖరికి ఇంట్లో ఉండే భార్య కూడా వెంట నిలిచే అవకాశం ఉండదు.  చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం ఎలాంటిది అంటే..
    అధికారం, కుర్చీ కోసం సొంత మామ ఎన్టీయార్ నే వెన్నుపోటు పొడవటం అన్నది ఆయన
    వ్యక్తిత్వం. ఇక ఆయన విశ్వసనీయత ఏమిటంటే.. ఎన్నికలకు ముందు అబద్దాలు చెప్పటం,
    తర్వాత ప్రజల్ని మోసగించటం అన్న మాట. ఇక చంద్రబాబుకే వ్యక్తిత్వం, విశ్వసనీయత
    లేకపోతే ఆయన వెంట కొనుగోళ్లకు ఆశపడి వెళ్లిపోయిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడటమే
    అనవసరం.

    భయపడేది లేదు

           ఎన్నికలకు
    ముందు పరిస్థితిని ఒక్కసారి గుర్తు చేసుకొంటే.. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్
    పార్టీకి రాజీనామా చేసి ప్రజల్లోకి వచ్చాం. అప్పుడు చూస్తే 175 స్థానాలు ఖాళీగా
    కనిపించాయి. నాయకులు కనిపించలేదు. అయినా భయపడలేదు. అధికారం లో ఉన్న సోనియాగాంధీని
    చూసి భయపడలేదు. సోనియాగాంధీతో కలిసి కుమ్మక్కై చంద్రబాబు.. నన్ను కేసుల్లో
    ఇరికించినప్పుడు    భయపడలేదు. ఎందుకంటే పైన ఉన్న దేవుడ్ని, ఇక్కడ
    ఉన్న ప్రజల్ని నమ్ముకొన్నాను కాబట్టే భయ పడలేదు. అప్పుడు ఇద్దరితో మొదలైన పార్టీ..
    ఇప్పుడు 67 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీల స్థాయికి చేరుకొంది. దేశం మొత్తం మన
    వైపు చూసేట్లుగా చేయగలిగాం. ఎప్పుడూ నాయకుల్ని నమ్ముకోలేదు. ప్రజలు, దేవుడ్ని
    నమ్ముకొన్నాం. వాళ్లే ఆశీర్వదిస్తారు.

    చంద్రబాబు చెప్పేదంతా మోసం

           వాస్తవానికి ఇటువంటప్పుడు
    చంద్రబాబు చేయాల్సింది తన హామీలను నిజం చేయటం మీద ద్రష్టి పెట్టాలి. ఎన్నికలకు
    ముందు రక రకాల అబద్దాలు చెప్పి రైతులు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలు, ఆఖరికి
    నిరుద్యోగ యువతను మోసం చేశారు. చదువుకొనే పిల్లల్ని మోసం చేశారు. ఎన్నికలకు ముందు
    ఆ కులం, ఈ కులం అని చెప్పి రక రకాల కులస్తుల్ని మోసం చేసిన ఘనత చంద్రబాబుది. ఆ
    రోజు ఎన్నికలకు ముందు ప్రజలకు మాయ మాటలు చెప్పి మోసం చేశారు. ఇప్పుడు ఎన్నికలు
    అయిపోయాయి. ప్రజల్ని గాలికి వదిలేశారు. ప్రజల గొంతు వినిపించకుండా ఉండేందుకు
    అవినీతి డబ్బులతో, ప్రలోభాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు.        పెద్ద పెద్ద సామ్రాజ్యాలే కుప్ప కూలాయి.
    హిట్లర్ వంటి నియంత  వ్యవస్థలే కూలిపోయాయి.
    ప్రజల కోపానికి తట్టుకోలేక చంద్రబాబు ప్రభుత్వం బంగాళాఖాతంలో పడిపోయే రోజు
    దగ్గరలోనే ఉంది. దేవుడు చూస్తున్నాడు, ప్రజలు గమనిస్తున్నారు. త్వరలోనే
    చంద్రబాబుకి మొట్టికాయలు వేస్తారు. చంద్రబాబు ఆఖరికి డిపాజిట్లు కూడా
    దక్కించుకోకుండా పోతారు.

    ప్రజల ఆశీస్సులతోనే..!

           మీ అందరి దీవెనలు, ఆశీస్సులు
    కావాలి.  మీ
    అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులతో చంద్రబాబు తో మరింత పోరాటానికి సిద్ధంగా
    ఉన్నాను. కష్టం అనిపించినా, తొమ్మిది గంటల నుంచి వేచి ఉన్నా మీ అందరికీ పేరు
    పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నా.      ఈ
    రోజునుంచి విజయ్ అన్న మా కుటుంబంలో ఒకరుగా ఉంటారు. ఆయన్ని మా కుటుంబలోని వ్యక్తిగా
    చూసుకొంటాం.

     అని వైఎస్ జగన్ ఆత్మీయపూర్వకంగా
    ప్రసంగించారు.

     

Back to Top