పాత పద్ధతిలోనే పింఛన్లు పంపిణీ చేయాలి

శ్రీకాళహస్తి:  ఎన్‌టీఆర్‌ భరోసా పింఛన్లు పాత పద్ధతిలోనే పంపిణీ చేయాలని వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి పునుగోటి భక్తవత్సలనాయుడు డిమాండ్‌ చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామనగర్‌ కాలనీలో ఆయన విలేకర్లుతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు వారి ఖాతాల్లో పింఛన్‌ వేస్తామని చెప్పి ఇప్పుడు బ్యాంకులు చుట్టూ తిప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అది కూడా ఇద్దరికి కలిపి రూ.2 వేల నోటు ఇస్తున్నారని, ఆ నోటుకు చిల్లర దొరక్కక వృద్ధులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతమన్నారు. బ్యాంకుల్లో అప్పు ఉంటే పింఛన్‌ సొమ్మును జమచేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే వృద్ధులు ఐదారు సార్లు బ్యాంకులకు వచ్చినా.. నగదు లేదని చెప్పటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధులు, వికలాంగులను దృష్టిలో పెట్టుకుని వారికి అనుకూలంగా పింఛన్లు పంపిణీ చేయాలని ఆయన కోరారు.
 
Back to Top