పెంపు ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి


హైదరాబాద్, 9 జనవరి 2013:

విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలకు నిరసనగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారంనాడు విద్యుత్ సౌధ వద్ద ఆందోళనకు దిగింది. కరెంటు చార్జీల పెంపు ప్రతిపాదనలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి దయాదక్షిణ్యాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచేలా విద్యుత్ చార్జీలు పెంచుతోందని ఆరోపించింది. ఇప్పటికే సర్దుబాటు చార్జీల పేరుతో ప్రజలపై భారం మోపిందని విమర్శించింది.

     వచ్చే ఏప్రిల్ మాసం నుంచి విద్యుత్ చార్జీలను పెంచాలనే ప్రతిపాదనలను నిరసిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యుత్ సౌధ వద్ద చేపట్టిన ఆందోళనా కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్నాకు దిగడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.

     ఈ సందర్భంగా పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల పేద ప్రజలపై అధిక భారం పడుతోందన్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్నముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెపుతారని హెచ్చరించారు. ధరలను అదుపు చేయడం చేతగాని సీఎం వెంటనే పదవిలోంచి దిగిపోవాలని గట్టు డిమాండ్ చేశారు.

     తాము శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తామని చెప్పినప్పటికీ పోలీసులు అడ్డు తగలడం శోచనీయమని గట్టు అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంని మండిపడ్డారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా తమ పోరాటం కొనసాగుతుందన్నారు.

Back to Top