ఆ ఎమ్మెల్యేలు మ‌ళ్లీ గెలిస్తే... రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటా


పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి
విజ‌య‌వాడ‌:  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేలు డ‌బ్బుకు ఆశ‌ప‌డి టీడీపీలో చేరార‌ని వైఎస్సార్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఆరోపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి ఉపఎన్నిక‌ల్లో మ‌ళ్లీ గెలిస్తే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని స‌వాల్ విసిరారు. పార్టీ వీడిన వారు ముందుగా ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఓ పార్టీ గుర్తుతో గెలిచి, మ‌రో పార్టీలోకి వెళ్ల‌డం నైతిక‌మ‌ని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. చంద్ర‌బాబు త‌న అవినీతి డ‌బ్బును ఎర‌గా చూపి ఒక్కొ ఎమ్మెల్యేకు రూ. 30 నుంచి రూ. 50 కోట్లు ఎర‌గా చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. పార్టీ మారితే మంత్రి ప‌ద‌వులు ఇస్తామ‌ని ఆశ‌పెడుతున్నార‌న్నారు. మొద‌టి నుంచి చంద్ర‌బాబు అధికారం కోసం అడ్డ‌దారుల్లో వెళ్ల‌డం వెన్న‌తో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని నారా లోకేష్ కుంభ‌కోణాల‌కు తెర తీస్తున్నార‌ని మండిప‌డ్డారు. రాజ‌ధాని నిర్మాణం పేరుతో ప్ర‌జాధ‌నాన్ని దోచుకుంటున్నార‌ని ఆరోపించారు. ప‌ది మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడితే వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీకి వ‌చ్చే న‌ష్ట‌మేమి లేద‌న్నారు. 10 మంది మారితే వారి స్థానంలో వంద మంది నాయ‌కుల‌ను త‌యారు చేస్తామ‌న్నారు. చంద్ర‌బాబుకు ఏమాత్రం ద‌మ్ము, ధైర్యం ఉన్న పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించి ప్ర‌జాక్షేత్రానికి రావాల‌ని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. 
Back to Top