నాకూ వ్య‌క్తిత్వం ఉంది-మాజీ మంత్రి పెద్ది రెడ్డి

పుంగనూరు:  నాకు వ్య‌క్తిత్వం ఉంది, నేను దానిపైనే న‌డుస్తా అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి పెద్ది రెడ్డి రామ‌చంద్రారెడ్డి అన్నారు. టీడీపీ లోకి వ‌ల‌స మారిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వ్యాఖ్య‌ల మీద ఆయ‌న మండి పడ్డారు.  ‘నా గురించి మాట్లాడేందుకు జలీల్‌ఖాన్ ఎవరు? ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ చెబితే పార్టీలు మారుతామా! టీడీపీ ఆఫీస్‌లో పనీపాట లేకుండా మాట్లాడే వారికి నేను సమాధానం ఇవ్వాలా? ’ అంటూ  రామచంద్రారెడ్డి నిప్పులు చెరిగారు. చిత్తూరు జిల్లా పుంగ‌నూరు లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. 

ఎన్నికల తరువాత శాసనసభాపక్ష సమావేశంలో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలోనే పార్టీ మారబోనని స్పష్టం చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేలను రకరకాల ప్రలోభాలకు గురిచేసి, పార్టీలోకి చేర్చుకుంటున్నారని ఆరోపించారు. ప్రజాభిమానంతో పదవులు పొందే వారికి శాశ్వత గుర్తింపు ఉంటుందన్నారు. డబ్బులు, అధికారం కోసం పార్టీలు మారే వారి రాజకీయ భవిష్యత్తు ప్రశార్థకమేనని, మనుగడ ఉండదన్నారు. 

సంక్షేమ పథకాలు ప్రకటనలకే పరిమితమయ్యాయని పెద్దిరెడ్డి దుయ్యబట్టారు.  చంద్రబాబు ఎన్నికల్లో ఖర్చుచేసిన డబ్బు జమ చేసుకునేందుకు రకరకాల ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనం లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు, మంత్రిమండలికి నూతన రాజధాని నిర్మాణంలో ఉన్న ఉత్సాహం ప్రజల సంక్షేమ పథకాల అమలులో లేదన్నారు. ఇంకుడు గుంతల తవ్వకం పనికిరాని కార్యక్రమమని విమర్శించారు. చెరువులు, ప్రాజెక్టుల పనులు చేపట్టి వాటిని బలోపేతం చేస్తే వర్షపు నీటిని నిలువ చేయవచ్చని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ సర్కారు పాలనలో విఫలమైందని, రెండేళ్ల కాలంలోనే ప్రజల మన్ననలు కోల్పోయిందన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇలా ప్రతి ఒక్కరూ అనేక సమస్యలతో సతమతమవుతున్నారని తెలిపారు.
 

తాజా ఫోటోలు

Back to Top