పయ్యావుల కేశవ్ భూదందా

• కొనుగోలు 4.09 ఎకరాలు
• చెల్లించినది 12.27 లక్షలు
• ప్రస్తుత విలువ 8 కోట్లు

ప్రభుత్వ పెద్దలు, టీడీపీ నాయకులు రాజధాని ప్రాంత రైతులను మోసగించి తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేశారనడానికి టీడీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ భూముల కొనుగోళ్లే మరో ఉదాహరణ. నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టగానే అంతర్జాతీయ స్థాయిలో రాజధాని నిర్మిస్తానంటూ ఆర్భాటంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఎక్కడ నిర్మిస్తారో స్పష్టంగా చెప్పకుండా ముచ్చటగా మూడు పేర్లు ప్రజలను గందరగోళానికి గురిచేశారు. కానీ తన అనుయాయులకు మాత్రం రాజధాని ప్రాంతం విషయంలో ముందుగానే స్పష్టతనిచ్చారు. ఇంకేం అనంతపురానికి చెందిన టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ రాజధాని ప్రాంతంలో వాలిపోయారు.



ఎక్కడ భూములు తక్కువ ధరకు లభిస్తాయో, ఏ భూములు కొంటే ఎక్కువ లాభం చేసుకోవచ్చో దగ్గరగా పరిశీలించారు. కోర్ కేపిటల్ లోని తుళ్లూరుకు అతి దగ్గరగా ఉండే అయినవోలు గ్రామంలో 4.09 ఎకరాలు కొనుగోలు చేశారు. సర్వే నెంబరు 48/3లో 2.13ఎకరాలు, సర్వే నెంబరు 49/3లో 1.96 ఎకరాలు కలిపి మొత్తం 4.09 ఎకరాల భూమిని 2014 అక్టోబరు 13న  కేశవ్ పెద్దకుమారుడు పయ్యావుల విక్రమసింహ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఎకరం 3.7 లక్షల చొప్పున 4.09 ఎకరాలను 12.27లక్షల రూపాయలకే కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. కానీ అయినవోలులో ప్రస్తుతం మార్కెట్ విలువ ఎకరా రూ.2కోట్లు వరకు ఉంది. అంటే ఏడాది వ్యవధిలో పయ్యావుల భూములకు 50 రెట్లకు పైగా ధర పలుకుతోంది. ప్రజా రాజధాని నిర్మిస్తున్నామని, ప్రజల మద్దతు ఓర్వలేకనే ప్రతిపక్షం ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు గుప్పిస్తోందని పదేపదే గగ్గోలు పెట్టే పయ్యావుల కేశవ్ మరి రైతుల భూములను మభ్యపెట్టి కొని వారికి అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసమో చెప్పాలి.
Back to Top