బాబు ఖజానా నింపుకునేందుకే పట్టిసీమ

పట్టిసీమ వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదు
బాబుది అంతా ప్రచార ఆర్భాటమే
కృష్ణాడెల్టాకే నీళ్లివ్వలేకపోయారు
రాయలసీమకు ఎలా ఇస్తారు 
బాబు అబద్ధపు ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారు
వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి వాసిరెడ్డి ప‌ద్మ‌

హైదరాబాద్ః  పట్టిసీమ ప్రాజెక్ట్ అవినీతి ప్రాజెక్ట్ అని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ముడుపుల కోసమే చంద్రబాబు ముచ్చటగా మూడోసారి పట్టిసీమ ప్రారంభోత్సవం చేశారని పద్మ ధ్వజమెత్తారు. చెల్లి పెళ్లి జ‌ర‌గాలి మ‌ళ్లీ మ‌ళ్లీ అన్న‌ట్లు చంద్ర‌బాబు ప‌రిపాల‌న ఉంద‌ని వాసిరెడ్డి ప‌ద్మఎద్దేవా చేశారు. ప‌ట్టిసీమ ప్రాజెక్టుకు 2015 మార్చిలో శంకుస్థాప‌న చేశార‌ని, సెప్టెంబ‌ర్‌లో మొద‌టిసారి ప్రారంభోత్స‌వం చేశార‌న్నారు. సంవ‌త్స‌రానికే ప్రాజెక్టును పూర్తి చేశామ‌ని చెప్పుకునేందుకు 2016 మార్చిలో మరోసారి ప్రారంభించి, నేడు మూడోసారి ప్రారంభోత్సం చేశారన్నారు. చేసిన ప్రారంభోత్సవాన్నే మళ్లీ మళ్లీ చేస్తున్నారు తప్పితే పట్టిసీమ వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని వాసిరెడ్డి పద్మ  అన్నారు. ప్రజలను నమ్మించడం కోసం బాబు చేస్తున్న ఆర్భాటాల వల్ల ఆంధ్రప్రదేశ్ పరువు పోతోందని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. 

అంతా ప్రచార ఆర్భాటమే..
ప‌ట్టిసీమ ప్రారంభం పేరుతో ఎన్నిసార్లు న‌దుల అనుసంధానం చేస్తార‌ని ఆమె ప్ర‌శ్నించారు. 24 పంపుల‌ ద్వారా నీళ్లుఇస్తున్నామని చెప్పుకుంటూ కెమెరాల ముందు ప్రచార ఆర్భాటం చేస్తున్నారు తప్పితే బాబు చేసిందేమీ లేదని పద్మ దుయ్యబట్టారు. బాబు స్విచ్ ఆన్ చేయగానే అక్క‌డి ఇంజ‌నీర్లు ఆ స్విచ్‌ల‌ను ఆపేందుకు సిద్ధంగా ఉన్నార‌న్నారు. దానికి కార‌ణం 60 కిలోమీట‌ర్లు దాటిన అనంత‌రం నీరు ఎక్క‌డికి పోయే దారి లేద‌న్నారు.  రెండ‌వ సారి ప్రాజెక్టును ప్రారంభించేప్పుడు కృష్ణాడెల్టాకు ర‌బీ సీజన్ వ‌ర‌కు నీరందిస్తామ‌న్న హామీ ఏమైందని బాబును నిలదీశారు. ప‌ట్టిసీమ ప్రాజెక్టు ల‌క్ష్యం రాయ‌ల‌సీమ‌కు నీరందించ‌డ‌మేన‌న్న మాట దేవుడెరుగు... కృష్ణా డెల్టాకు నీరందిస్తే చాల‌న్న పరిస్థితి నెల‌కొంద‌న్నారు. బాబు మాట‌లు ఏ రాజ‌నీతికి నిద‌ర్శ‌న‌మ‌ని పద్మ ప్ర‌శ్నించారు. ప‌ట్టిసీమ ప్రాజెక్టు ద్వారా 8,500 క్యూసెక్కుల నీటిని అందిస్తామన్న మాటలన్నీ నీటిమూటలేనన్నారు. 

బాబు ఖజానా నింపుకునేందుకే..
ప‌ట్టిసీమ ప్రాజెక్టు అంచ‌నా రూ. 13వంద‌ల కోట్లు అని, కాంట్రాక్ట‌ర్‌కు 21శాతం ఎక్సెస్ ఇచ్చి, కాంట్రాక్ట‌ర్‌కు అత్య‌ధికంగా ముడుపులు క‌ట్ట‌బెట్టి బాబు అందులో వాటాలు తీసుకుంటున్నార‌ని ఆరోపించారు. దాదాపు వేయి కోట్ల రూపాయ‌ల అవినీతి జ‌రిగింద‌న్నారు. 60 కిలోమీట‌ర్ల మేర ప‌ట్టిసీమ ప్రాజెక్టు నీరు వెళ్లే కాలువ‌ల‌ను సైతం దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి నిర్మించిన‌వేన‌ని ఆమె గుర్తు చేశారు. ప‌ట్టిసీమ ద్వారా వేయి క్యూసెక్కుల నీటిని విడుద‌ల చేస్తున్నామని బాబు చెబుతున్నారని....ఆ వేయి క్యూసెక్కులు ఓ టీఎంసీకి కూడా సరిపడవన్నారు. ఆనాడు ప‌ట్టిసీమ ద్వారా 80 టీఎంసీల నీరు అందిస్తామ‌న్న బాబు మాట‌ల్లో ఒక్క నిజం కూడా లేద‌న్నారు. ప‌ట్టిసీమ ప్రాజెక్టు కేవ‌లం బాబు ఖాజాన నింపుకునేందుకేన‌ని ఆమె మండిప‌డ్డారు. దేశంలో ఏ ముఖ్య‌మంత్రి పెట్ట‌ని నిబంధ‌న‌ను బాబు పెట్ట‌ార‌న్నారు. ఇలాంటి దిక్కుమాలిన ఒప్పందాలు ఎవ‌రూ చేయ‌ర‌ని నిప్పులు చెరిగారు.

పోల‌వ‌రాన్ని ఎందుకు ప‌ట్టించుకోరు..?
ప‌ట్టిసీమ‌కు బ‌దులు పోల‌వ‌రం ప్రాజెక్టుపై చిత్త‌శుద్ధి చూపించి ఉంటే ఎంతో అభివృద్ధి జ‌రిగి ఉండేద‌న్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టును వెన‌క్కు వేసేందుకే ప‌ట్టిసీమ‌ను ముందుకు వేసుకున్నార‌ని ఆరోపించారు. బాబు వైఖ‌రి వ‌ల్ల రాష్ట్రం ప‌రువు పోతుంద‌న్నారు. ప‌ట్టిసీమ పేరుతో జ‌రుగుతున్న అబ‌ద్ధపు ప్ర‌చారాన్ని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌న్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టును 2018వ‌ర‌కు పూర్తిచేస్తామ‌న్నార‌ని, మ‌రి ఇప్ప‌టి వ‌ర‌కు పోల‌వ‌రం ప‌నులు ఎందుకు చేప‌ట్టలేద‌న్నారు. పోల‌వ‌రం విష‌యంలో ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావ‌డం లేద‌న్నారు. మ్యానిఫెస్టోలో లేని ప్రాజెక్టును కేవ‌లం ముడుపుల కోస‌మే ప్రారంభించార‌న్నారు. ఈ అవినీతిపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రుగుతుంద‌న్నారు. విచ్చలవిడిగా బాబు అవినీతికి పాల్పడుతూ  వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటుందని మాట్లాడడం హాస్యాస్పదమన్నారు.  వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ కేవ‌లం బాబు చేసే అవినీతికి మాత్రమే అడ్డు ప‌డుతుంద‌న్నారు.
Back to Top