పట్టిసీమ..కొట్టు సీమగా మారింది

నెల్లూరు: పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో టీడీపీ దోపిడీకి పాల్పడిందని, అది అధికార పార్టీకి కొట్టు సీమగా మారిందని వైయస్‌ఆర్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి విమర్శించారు. మేం ఈ ప్రాజెక్టుపై ముందు  నుంచి చేస్తున్న అవినీతి ఆరోపణలు కాగ్‌ నివేదిక ద్వారా నిజమయ్యాయని, దోచుకోవడానికి ఈ ప్రాజెక్టును చేపట్టారని ఆయన విమర్శించారు. సోమవారం మనుబోలు మండల రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించిన గ్రివెన్స్‌సెల్‌లో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ తీరును ఎండగట్టారు. పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేశామని చంద్రబాబు గొప్పలు చెబుతున్నారని విమర్శించారు. అభివృద్ధిలో, అవినీతిలో ఏపీ నంబర్‌ వన్‌గా చేశామని చంద్రబాబు చెప్పకనే చెప్పారని ఎద్దేవా చేశారు. కాగ్‌ నివేదికలో బట్టబయలు అయ్యిందో వాటికి అధికారులు సమాధానం చెబుతారని సీఎం చెప్పడం సిగ్గు చేటు అన్నారు. కాగ్‌ నివేదికలో చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని తేల్చి చెప్పినా కూడా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా టీడీపీ నాయకులకు అభివృద్ధి నిధులు కేటాయించడం సరికాదన్నారు. 2019లో అడ్డ దారిలో అధికారంలోకి వచ్చేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. అందరికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కాకాణి డిమాండ్‌ చేశారు.

Back to Top