పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీల పోటీకి పార్టీ దూరం

హైదరాబాద్, 4 ఫిబ్రవరి 2013: పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఎన్నికలకు దూరంగా ఉండాలని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ నిర్ణయించింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం సమావేశమైన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పి.ఎ.సి.) ఈ మేరకు నిర్ణయించింది. ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేని, విద్యావంతులతో కూడిన ఎన్నికలు జరుగుతున్నందున పోటీకి దూరంగా ఉండాలని పి.ఎ.సి. నిర్ణయం తీసుకుంది.

శ్రీమతి షర్మిల ఈ నెల 6వ తేదీన 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్రను పునఃప్రారంభిస్తున్న నేపథ్యంలో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో పాదయాత్ర రూట్‌మ్యాప్‌, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపైన కమిటీ చర్చించింది. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, దానికి పరోక్షంగా మద్దతుగా నిలుస్తున్న ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి తీరుకు నిరసనగా వైయస్‌ఆర్‌సిపి అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.

సహకార సంఘాల ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ముందుగా ఊహించిన విధంగానే అధికార కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు తొక్కిందని ‌ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు అభిప్రాయపడ్డారు. సభ్యత్వ నమోదు మొదలు ఓటింగ్ ‌ముగిసే వరకూ అన్ని అంశాల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని వారు విమర్శించారు.
మన రాష్ట్రంలో మైనారిటీ ప్రభుత్వం కొనసాగుతున్నదని అధికార పక్షానికే చెందిన ముఖ్యనేత స్వయంగా ప్రకటించినా, ప్రధాన ప్రతిపక్షం టిడిపి వ్యవహరిస్తున్న తీరుపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ప్రజల తరఫున పోరాటం చేయాల్సిన ప్రధాన ప్రతిపక్షం, పాలక పక్షంతో కొనసాగిస్తున్న చీకటి స్నేహాన్ని పి.ఎ.సి. నాయకులు ఈ భేటిలో ప్రస్తావించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు స్వలాభం కోసం ప్రజలను పణంగా పెడుతున్నారని వారు ఈ సందర్భంగా మండిపడ్డారు. తన మచ్చలను కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబునాయుడు పాదయాత్ర సందర్భంగా ప్రతిరోజూ అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు.

కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ, టిడిపి తీరు ప్రజలకు అర్థమయ్యేలా విస్తృతంగా ప్రచారం చేయాలని పి.ఎ.సి. సమావేశంలో వైయస్‌ఆర్‌సిపి నాయకులు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో పి.ఎ.సి. సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, సభ్యులు డి.ఎ. సోమయాజులు, భూమా శోభా నాగిరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌ పాల్గొన్నారు.
Back to Top