పాత పాటే పాడుతూ ప్రజల ప్రాణాలతో ఆటలు..!

హోదా వద్దు..ప్యాకేజీయే ముద్దంటూ  కుట్ర..!
ప్రత్యేకహోదాను మరుగునపరుస్తున్న పచ్చసర్కార్..!


రాష్ట్రాభివృద్ధికి ప్రాణవాయువులాంటి ప్రత్యేకహోదాను వదిలేసి...పాత పాటే పాడుతూ పచ్చనేతలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రత్యేకహోదా వద్దు, ప్యాకేజీయే ముద్దంటూ తమ జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజానీకమంతా ప్రత్యేకహోదా కోసం నినదిస్తుంటే ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ప్రవర్తించడం హేయమైన చర్య. రాష్ట్రానికి రావాల్సిన నిధులనే ప్యాకేజీ రూపంలో తీసుకొచ్చేలా ప్రత్యేకహోదాను మరుగున పర్చేకుట్ర చేస్తున్నారు. అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు సంకేతాలిస్తున్నాయి. 

ప్రజల బాధలు పట్టని ప్రభుత్వం..!
ప్రత్యేకహోదాపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన చర్యల వల్ల.. రాష్ట్రంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్రానికి హోదా రాకపోతే తమ బతుకులు బాగుపడవని, తమ పిల్లలకు ఉద్యోగాలు రావేమోనన్న బెంగతో ఆత్మబలిదానాలు చేసుకుంటున్నారు. ఐనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కనీస చలనం లేదు. చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టి...రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాడు. 

మసిపూసి మారేడు కాయ..!
విశాఖ, విజయవాడ మెట్రోరైలు, పెట్రో కారిడార్ , రాజధాని నిర్మాణానికి కావల్సిన నిధులన్నీ విభజనచట్టంలో పొందుపర్చినవే. వాటినే మసిపూసి మారేడు కాయ చేసి ప్యాకేజీ పేరుతో ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నాడు. ఎప్పటికప్పుడు ప్రత్యేకహోదాపై దాటవేత ధోరణితో కపట నాటకాలను కొనసాగిస్తున్నాడు. ప్రత్యేకహోదా సంజీవని కాదని ఓసారి , స్వర్గం అంతకన్నా కాదని మరోసారి , అంతకన్నా ఎక్కువే ఇస్తారని ఇంకోసారి ఇలా చంద్రబాబు పూటకో అబద్ధం చెబుతూ నాలుగు కళ్ల సిద్దాంతాన్ని వళ్లెవేస్తున్నాడు . హోదా ఐదేళ్లు కాదు 15 ఏళ్లు కావాలని తిరుపతి వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చిన మోడీ, చంద్రబాబులు నేడు దాన్ని తుంగలోతొక్కడం దారుణం.

సంకల్పాన్ని ఆపలేరు..!
ప్రత్యేకహోదా కోసం ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు చేయని పోరాటం లేదు. ధర్నాలు, బంద్ లు చేపట్టారు. అసెంబ్లీలో అధికారపార్టీ మెడలు వంచి హోదా తీర్మానానికి ఆమోదముద్ర వేయించారు.  ప్రత్యేకహోదా ప్రాముఖ్యత గురించి చాటిచెప్పి రాష్ట్ర ప్రజానీకాన్ని మేలుకొల్పారు. ప్రాణాలు పణంగా పెట్టి దీక్ష కూడా చేపట్టారు. కానీ చంద్రబాబు మాత్రం హోదాను పక్కనబెట్టి వైఎస్ జగన్ పోరాటాలను అణగదొక్కడమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నాడు. దీక్షను భగ్నం చేసినా, పోరాటాలు అణగదొక్కినా...తమ సంకల్పాన్ని మాత్రం ఆపలేరని వైఎస్ జగన్ ప్రభుత్వాలపై పోరాడుతూనే ఉన్నారు. రాష్ట్రానికి హోదా వచ్చేదాకా విశ్రమించబోనని తెగేసి చెబుతున్నారు. హోదాను పోరాడి సాధించుకుందామని ...ఎవరూ ఆందోళనకు గురికావద్దని వైఎస్ జగన్ ప్రజలకు మరోసారి సూచించారు.

తాజా వీడియోలు

Back to Top