పశ్చిమగోదావరి జిల్లాలోకి నేడు షర్మిల పాదయాత్ర

ఖమ్మం, 12 మే 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 146వ రోజు ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఈ రోజు శ్రీమతి షర్మిల మొత్తం 12.2 కిలోమీటర్లు పాదయాత్రగా నడుస్తారని పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ కన్వీనర్ బాలరాజు తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని పాకలవారంగూడెం ‌నుంచి ముందుకు సాగడంతో ఈ జిల్లా పాదయాత్ర పూర్తి అవుతుందని వారు తెలిపారు. చంతలపూడి నియోజకవర్గం గురుభట్లగూడెంలోకి అడుగిడడం ద్వారా శ్రీమతి షర్మిల పశ్చిమ గోదావరి జిల్లాలోకి అడుగుపెడతారని వారు చెప్పారు.

పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపూడి, పోలవరం, గోపాలపురం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, ఉండి, భీమవరం, నర్సాపురం, పాలకొల్లు, ఆచంట, తణుకు, నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గాల్లో శ్రీమతి షర్మిల పాదయాత్ర సాగుతుంద రఘురాం, బాలరాజు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 20 రోజుల పాటు 275 కిలోమీటర్ల మేర శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది.

శ్రీమతి షర్మిల ఆదివారంనాటి పాదయాత్ర ఖమ్మం జిల్లాలోని తల్లమడ నుంచి ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి ఆమె బేతుపల్లి మీదుగా గంగారాం వరకూ నడుస్తారు. గంగారాం వద్ద మధ్యాహ్న భోజన విరామం ఉంటుంది. విరామం అనంతరం శ్రీమతి షర్మిల పాతపాకలగూడెం, పాకలగూడెం, గురుబట్లగూడెం మీదుగా లింగగూడెం వరకూ పాదయాత్ర చేస్తారు. ఆదివారం రాత్రికి శ్రీమతి షర్మిల లింగగూడెం వద్ద ఏర్పాటు చేసిన బసలో రాత్రి విశ్రాంతి తీసుకుంటారని రఘురాం, బాలరాజు వివరించారు.
Back to Top