అప్రజాస్వామికంగా పనిచేయడం సిగ్గుచేటు

రైతులను బెదిరించి భూములు లాక్కుంటున్నారు
పంటలను ధ్వంసం చేస్తూ కేసులు 
మద్యంపై చంద్రబాబు దొంగనాటకం

హైదరాబాద్ః సంపూర్ణ మద్య నిషేధం విధించాలని ప్రతిపక్ష నేత  వైఎస్ జగన్ ప్రభుత్వానికి సూచిస్తే దానికి సమాధానం చెప్పకుండా సంబంధం లేని వ్యాఖ్యలు చేస్తున్నారంటూ టీడీపీ నేతలపై పార్ధసారథి మండిపడ్డారు. ఎన్టీఆర్ సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తే.... దాన్ని ఎత్తివేసి పూర్తిగా మద్యపానం చేసిన ఘనత చంద్రబాబుదేనన్న విషయం తెలుగుదేశం నాయకులు గుర్తించాలన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న పాలసీ కారణంగా పేదల జీవితాలు బుగ్గిపాలు అవుతున్నాయని గుర్తించి... తమ అధినేత వైఎస్ జగన్ సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లోకి తెస్తానని చెప్పారన్నారు. మద్యంపై టీడీపీ ప్రభుత్వం విధానమేంటో చెప్పకుండా కేవలం రాజకీయ ప్రకటనలకే పరిమితమవ్వడం శోచనీయమన్నారు. 

గత సంవత్సర కాలంగా రాజధాని ప్రాంతంలో రైతులను, ఆప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేస్తూ టీడీపీ సర్కార్ భూములు లాక్కొంటున్న విధానంపైనా పార్ధసారథి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎవరు చేస్తున్నారో తెలియనట్లు నటిస్తూ ల్యాండ్ పూలింగ్ ను వ్యతిరేకిస్తున్న వారిపై కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతోందంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. బోయపాటి సుధారాణి అనే మహిళ తన భూమి ఇవ్వనంటే తెలుగుదేశం నాయకులు భయపెట్టి ఏవిధంగా లాక్కున్నారో అందరికీ తెలిసిందేనన్నారు. పొలం తీసుకుంటే తాము ఏవిధంగా బతకాలని, టీడీపీకి ఓటేసి చెప్పుతో కొట్టుకున్నట్లు అయ్యిందని సుధారాణి ఆక్రోషిస్తే కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగారన్నారు. 

గద్దె చంద్రశేఖర్ అనే రైతుకు చెందిన  భూమిని తగలబెట్టి ....తిరిగి వారిపైనే కేసులు పెట్టి అతని మేనల్లుడిని పది రోజుల పాటు  స్టేషన్ లో చిత్రహింసలకు గురిచేశారని పార్ధసారథి అన్నారు. రాజేశ్ అనే మరో రైతకు చెందిన... చేతికొచ్చిన 8 ఎకరాల్లోని పంటను ధ్వంసం చేసి చదును చేశారన్నారు. సీఆర్డీఏ అధికారులే దగ్గరుండి 8 ఎకరాలను ధ్వంసం చేశారని, అడిగితే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చంద్రబాబు కనుసన్నల్లో భూదందా కొనసాగుతుందని విమర్శించారు. అప్రజాస్వామికంగా పంటలను ధ్వంసం చేస్తూ పనిచేయడం సిగ్గుచేటన్నారు.  దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాజా వీడియోలు

Back to Top