పార్థ‌సార‌ధి గృహ‌నిర్భందం

అమ‌రావ‌తి:  అధికార పార్టీ నేత‌లు పోలీసుల‌ను అడ్డుపెట్టుకొని ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల‌ను నిర్భందిస్తున్నారు. నిన్న వైయ‌స్ఆర్‌సీపీ నేత అంబ‌టి రాంబాబును బ‌హిరంగ చ‌ర్చ‌కు వెళ్ల‌కుండా అడ్డుకున్న పోలీసులు ఇవాళ వైయ‌స్ఆర్‌సీపీ నేత పార్థ‌సార‌ధిని గృహ‌నిర్భందం చేశారు. జ‌న్మ‌భూమిలో పాల్గొన రాద‌ని పోలీసులు ఆంక్ష‌లు విధించ‌డంతోకంకిపాడు మండ‌లం కోల‌వెన్న‌లో ఉద్రిక్త‌త నెల‌కొంది. బ‌య‌ట‌కు వ‌స్తే అరెస్టు చేస్తామ‌ని పోలీసులు హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డంతో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ఆందోళ‌న‌కు దిగారు.

పోలీసులను అడ్డం పెట్టుకుని జన్మభూమి సభలు ..
ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడుతూ ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేక తమని అరెస్ట్‌ చేశారని మండిపడ్డారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా జన్మభూమి సభకు వెళ్లకుండా విపక్ష నేతలను అడ్డుకుంటున్నారన్నారు. ప్రతి గ్రామ సభలోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయని, అయితే సమస్యలను లేవనెత్తే అవకాశమే ఇవ్వడం లేదన్నారు. నిలదీసిన విపక్ష నేతలను బలవంతంగా అరెస్ట్‌ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జన్మభూమి కార్యక్రమాలు నామమాత్రంగా జరుగుతున్నాయని, పోలీసులను అడ్డం పెట్టుకుని జన్మభూమి సభ నడిపిస్తున్నారని పార్థసారధి వ్యాఖ్యానించారు. గ్రామంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని ఆయన అన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయంలో విపక్ష నేతలకు మాట్లాడే అవకాశం ఇచ్చేవారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తోందన్నారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేశామని చెప్పే ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమానికి ప్రతపక్షాలను ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. డ్వాక్రా రుణమాఫీ ఎవరికి చేశారని, రుణాలు చెల్లించాలని బ్యాంక్‌ల నుంచి మహిళలకు నోటీసులు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు యత్నిస్తే అడ్డుకోవడం సరికాదంటూ...ప్రభుత్వ వైఖరికి నిరసిస్తూ ఆయన నోటికి నల్లరిబ్బన్‌ కట్టుకున్నారు. అలాగే వైఎస్‌ఆర్‌ సీపీ నేత పార్థసారధితో పాటు గ్రామ మాజీ సర్పంచ్‌ చంద్రశేఖర్‌ను కూడా పోలీసులు అరెస్ట్‌ చేసి కంకిపాడు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 


Back to Top