సోకులు మీకు... పస్తులు మాకా ..!



– సచివాలయానికి భద్రత పేరుతో విచ్చలవిడి ఖర్చు తగదు
– మొదటి సంతకానికి విలువ లేకుండా చేశారు
– ఎన్నికల హామీలు ఒక్కటైనా నెరవేర్చారా
– పది వేల కోట్లు సమాచారం మీకు ఎవరిచ్చారు?
– సీఎం స్థాయిలో అసత్య ప్రచారం తగదు
– చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైయస్‌ఆర్‌ సీపీ


సచివాలయ నిర్మాణం అంచనా వ్యయం పెంచేసి దోచుకునేందుకు చంద్రబాబు మరో కుట్రకు తెరలేపారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిథి కొలుసు పార్ధసారథి అన్నారు. తన సోకుల కోసం కోట్లకు కోట్లు ప్రజాధనం ఖర్చు చేస్తున్న చంద్రబాబు డ్వాక్రా మహిళల రుణమాఫీకి రెండుసార్లు దొంగ సంతకాలు చేయాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తెలుగుతమ్ముళ్లతో మాట్లాడుతూ పదేళ్లు హైదరాబాద్‌లోనే ఉంటానని చెప్పిన చంద్రబాబు రెండేళ్లకే ఎందుకు పలాయనం చిత్తగించారో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో కూడా పార్టీని అధికారంలోకి తెచ్చేదాకా విశ్రమించనని బీరాలు పలికావుగా అని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి కేసు నుంచి బయటపడేందుకే చంద్రబాబు అమరావతి పల్లవి అందుకున్నారని తెలిపారు. రాజధాని నిర్మాణం చేయడం సంతోషంగానే ఉన్నా అది కూడా అతీగతీ లేకుండా ఉండటం చంద్రబాబు పనితీరుకు నిదర్శనమన్నారు. 

మొదటి సంతకలు ఎన్నిసార్లు పెడతారు...
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకం అంటూ ఇచ్చిన హామీలు ఇప్పటికి కనీసం ఒక్కదాన్నైనా చంద్రబాబు నెరవేర్చారా అని ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాపీ, రూ.2 లకే ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పేరుతో 20 లీటర్ల మిన రల్‌ వాటర్, బెల్టు షాపుల నిర్మూలన వీటిలో కనీసం ఒక్క హామీ అయినా చంద్రబాబు నెరవేర్చి ఉంటే ఆయన విధించే ఏ శిక్షకైనా తాను సిద్ధమేనన్నారు. డ్వాక్రా మహిళల చేతికి ఒక్క రూపాౖయెనా చేతికందిందా అని ప్రశ్నించారు. అప్పుడిచ్చిన హామీలకే దిక్కులేదు.. మళ్లీ ఇప్పుడు రుణమాఫీపై సంతకం చెయ్యడానికి బాబుకు సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొంతన లేని మాటలు.. సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేయడం బాబుకే చెల్లిందన్నారు.

ఆరోజు చెట్టుకింద పాలన చేస్తామన్నావుగా... 
రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది గనుక ఖర్చులు తగ్గించుకోవాలి అని పదే పదే ఉపన్యాసాలు దంచుతున్న చంద్రబాబు చెప్పిన మాటలకు చేస్తున్న పనులకు పొంతనే లేదన్నారు. రాజధాని నిర్మాణం పూర్తయ్యే వరకు చెట్టు కింద పాలన సాగిస్తామన్న చంద్రబాబు ఇప్పుడేమో సచివాలయం నిర్మాణానికి అంచనా వ్యయం అమాంతం పెంచేస్తున్నారని ఆరోపించారు. సీఎం కార్యాలయానికి బుల్లెట్‌ ప్రూఫ్‌ అద్దాలు.. రాకెట్‌ దాడుల నుంచి రక్షణ కోసం శత్రు దుర్భేద్యంగా చేయడానికంటూ అవసరం లేని వసతుల కోసం అదనపు ఖర్చులు చేస్తున్నారని దుయ్యబట్టారు. మీరేమో ప్రజల సొమ్మును మంచినీళ్లలా ఖర్చు పెట్టుకుంటారు.. అన్నమో రామచంద్రా అని కరువుతో అలమటించే రైతుల సంగతమో పట్టించుకోరని విమర్శించారు. సిగ్గు, అభిమానం ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. 

దమ్ముంటే విచారణ చేయండి...
ఇటీవల చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పదివేల కోట్ల నల్లధనం ఒక వ్యక్తి వద్దనే ఉందని దుష్ప్రచారం మొదలు పెట్టారని పేర్కొన్నారు. ఇదిగో పులి అంటే అదిగో తోక అనడం అలవాటైన బాబు భజన బృందాలు ఆ వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి అంటూ విష ప్రచారానికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో మీరే ఉన్నారుగా దమ్ము.. ధైర్యం ఉంటే విచారణ చేసి ఆధారాలతో సహా బయటపెట్టండని డిమాండ్‌ చేశారు. మీరు చేస్తున్న ఆరోపణలను ఆధారాలతో సహా బయట పెడితే శిక్షకు సిద్ధమేనని ప్రకటించారు. అయితే పది వేల కోట్లు నల్లధనం ఉన్నాయని సమాచారం చంద్రబాబుకు ఎవరిచ్చారో బయటపెట్టాలన్నారు. అక్టోబర్‌ 3న సీబీడీటీ(సెంట్రల్‌ బోర్డు ఫర్‌ డైరెక్టు ట్యాక్సెస్‌), కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చేసిన ప్రకటనను ఆయన చదివి వినింపించారు. తాము నల్లధనానికి సంబంధించి ఏ వ్యక్తికి కానీ, వ్యాపార సంస్థల వివరాలు కానీ, రాష్ట్రాలు, పట్టణాల వివరాలను వెల్లడించలేదని అలాంటి వార్తలేమైనా ఉంటే అవి అసత్య ప్రచారాలేనని వాటిని నమ్మవద్దని ఇచ్చిన ప్రకటనను పార్థసారధి చదివారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఓ వ్యక్తి తానే స్వయంగా అసత్యాలను ప్రచారం చేయడం.., కేంద్ర ప్రభుత్వం,  కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే అత్యున్నత సంస్థల నియమ నిబంధనలు ఉల్లంఘించడం సిగ్గు చేటన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి హుందాగా వ్యవహరించి హుందాగా వ్యవహరించి నలుగురికి మార్గదర్శకంగా నిలవాలని సూచించారు. 

తాజా వీడియోలు

Back to Top