8 నుంచి షర్మిల 'తెలంగాణ' యాత్ర

హైదరాబాద్, నవంబరు 30: దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని చూసి తట్టుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల పరామర్శించనున్నారు. డిసెంబరు 8న మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నుంచి ఈ పరామర్శ యాత్ర ప్రారంభం కానుంది. జిల్లాలోని పది నియోజకవర్గాల్లో పర్యటించాక, జడ్చర్ల-షాద్ నగర్ లో యాత్ర ముగియనుంది.

ఈ మేరకు ఆదివారం లోటస్ పాండ్ లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. పరామర్శ యాత్ర పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎడ్మ కిష్టారెడ్డి, కొండా రాఘవరెడ్డి, నల్లా సూర్యప్రకాష్, హెచ్ ఏ రెహ్మాన్ లతో కలసి మీడియాతో మాట్లాడారు. మహబూబ్ నగర్ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన 18 మంది కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారని చెప్పారు.

గతంలో శ్రీ వైఎస్ జగన్ ఖమ్మంలో ఓదార్పు యాత్రను పూర్తి చేశారని, కొన్ని కారణాల వల్ల ఇది వాయిదా పడిందన్నారు. ఇప్పుడు శ్రీ వైఎస్ జగన్ సోదరి శ్రీమతి షర్మిల యాత్రను కొనసాగిస్తారన్నారు. వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలన్నారు. ఇది ఎన్నికలు, రాజకీయం కోసమో చేసే యాత్ర కాదని పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు. పార్టీ నేతలు మామిడి శ్యాంసుందర్ రెడ్డి, బి.రవీందర్ రెడ్డి, శేఖర్ దంపతులు, పి.నాగిరెడ్డి, గాదె నిరంజన్ రెడ్డి, భీంరెడ్డి సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top