బడ్జెట్‌ సమావేశాల తీరు బాధాకరం

ఏపీ అసెంబ్లీ: అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల తీరు బాధాకరమని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. బడ్జెట్‌ సమావేశాల్లో ప్రజలకు మేలు జరుగుతుందని అందరు ఆశించారని తెలిపారు. అయితే సమావేశాల నిర్వాహణ తీరు దారుణంగా ఉందన్నారు. ప్రజా సమస్యలను సభలో ప్రతిపక్షం లేవనెత్తితే ప్రభుత్వం చర్చకు ముందుకు రాకుండా తప్పించుకుందని విమర్శించారు. ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌కు మైక్‌ ఇచ్చిన నిమిషంలోనే కట్‌ చేసి టీడీపీ నేతలకు అవకాశం కల్పిస్తున్నారని అన్నారు. 


అధికార పక్షం సభ్యులు వ్యక్తిగత దూషణకు దిగి సభా సమయాన్ని వృథా చేశారని మండిపడ్డారు. దాదాపు 42 అంశాలపై సమావేశాల్లో చర్చించాలని మేం బీఏసీలో కోరినట్లు చెప్పారు. రాష్ట్రంలో కరువు తాండవిస్తోందని, చాలా ప్రాంతాల్లో పంటలు చేతికందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌ ఇవ్వాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ఎలాంటి చర్యలు లేవని విమర్శించారు. కాంట్రాక్టర్లు, టీడీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారని ఫైర్‌ అయ్యారు. పట్టిసీమ పేరుతో రూ.1600 కోట్లు కాజేశారని ఆరోపించారు. త్వరలోనే మళ్లీ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజా సమస్యలపై చర్చించాలని కొరముట్ల శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు.
Back to Top