పదవి కోసమా.. ప్రజల కోసమా..

హైదరాబాద్:

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్ర పదవి కోసమా ప్రజల కోసమా అనే అనుమానం కలుగుతోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయచోటి ఎమ్మెల్యే జి. శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహానేత రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్రకూ, చంద్రబాబు పాదయాత్రకూ మధ్య ఉన్న వైరుధ్యాలను వివరించారు. పార్టీపై మిగిలిన పార్టీలు ఇటీవలి కాలంలో చేస్తున్న విమర్శలు చూస్తుంటే ప్రజాదరణ గల తమపై ఏదోరకంగా బురదచల్లాలని ప్రయత్నించడంగానే భావిస్తున్నామని చెప్పారు.  ''వస్తున్నా మీకోసం' పేరిట చంద్రబాబు చేస్తున్న పాదయాత్ర ఆదినుంచి సినిమావాళ్ళ డైరెక్షన్లో నడుస్తోంది. అది పదవి కోసమా.. ప్రజల కోసమా అనుమానం వస్తోంది. 50 కిలోమీటర్ల పండగ, వంద రోజుల పండగ అంటూ కేకులు కట్ చేస్తూ నిర్వహిస్తున్నారు.' అని ఆయన ధ్వజమెత్తారు. పాదయాత్రను ఆయన రికార్డులు కోసమే చేపట్టినట్లుగా ఉందన్నారు.  ప్రజల కష్టనష్టాలు తెలుసుకోవడం మాని, పాదయాత్ర  రూపురేఖలు మార్చారన్నారు. గిన్నిస్ రికార్డు బ్రేక్ చేస్తానని చెబుతున్నారన్నారు. రాజశేఖరరెడ్డి గారితో పోల్చుకుంటూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.  'రాజశేఖరరెడ్డిగారు సొంత ఇమేజి ఉన్న వ్యక్తి. అలాంటి ఇమేజి లేని చంద్రబాబు ఎంతసేపూ మహానేత డాక్టర్ వైయస్ఆర్‌ను విమర్శిస్తూ పాదయాత్ర చేస్తున్నారు. డాక్టర్ వైయస్ఆర్ అన్నా, ఆయన కుంటుంబమన్నా, జగన్ పెట్టిన పార్టీ అన్నా బాబుకు ఎంత భయమో తెలుస్తోంది.' అని శ్రీకాంత్ వివరించారు. మహానేత డాక్టర్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసే నాటికి ఏ పదవినీ చేపట్టిన వ్యక్తి కాదన్నారు. ప్రతిపక్ష నేతగా ఆయన పాదయాత్ర చేశారన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకోడానికి ఆయన మండుటెండలో యాత్ర చేశారని వివరించారు. అదే చంద్రబాబు  మార్నింగ్ వాక్ మాదిరిగా పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాత్రి పన్నెండు గంటల వరకూ నడవడం. నడిచే బాటలో నీళ్ళు పోయించడం.. దున్నించడం. చేస్తున్నారన్నారు. సినిమా రికార్డుల మాదిరిగానే సాగుతోందన్నారు.  'డాక్టర్  వైయస్ఆర్ 64 రోజులలో 1462 కిమీ మండుటెండలో నడిచారు. ఇదే దూరాన్ని నడవడానికి బాబుకు 96 రోజులు పట్టింది.' అని వివరించారు.  రికార్డు సృష్టించానని చెప్పడానికి బాబు నడిచారని చెప్పారు. ఏసీ బస్సుల్లో పడుకుంటూ.. రోడ్డు పక్కన మట్టి రోడ్డుపై నీళ్ళు పోయించుకుంటూ నడుస్తున్న చంద్రబాబును  ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఒక్కరోజు కూడా నిజం చెప్పని బాబుకు  ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో  ప్రజల కష్టాలు గుర్తురాలేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తే ప్రజల కష్టాలు తీరుస్తానని చెబుతుండడం వెనుక ఉద్దేశాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.  తొమ్మిదేళ్ళు పదవి అనుభవించి... మళ్ళీ అధికారమిస్తే రాజశేఖరరెడ్డి గారి పథకాలను కొనసాగిస్తానని నిస్సిగ్గుగా చెబుతున్నారని ఎద్దేవా చేశారు. తన పదవీ కాంలో ఏమీ చేయలేకపోయానని క్షమాపణ చెప్పి పాదయాత్రకు పూనుకుని ఉంటే బాగుండేదని సూచించారు. 1500 కిమీ పూర్తయ్యిందని వరంగల్ జిల్లాలో శిలాఫలకాన్ని ఆయనే ఆవిష్కరించుకోవడం కంటే హాస్యాస్పదం లేదన్నారు.  హెల్తు వాక్ లా ఉన్న పాదయాత్రను ఎందుకు చేస్తున్నారో ఆయనే  ఆలోచించుకోవాలన్నారు. ఇది దేనికి సంకేతమో తెలపాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు కన్ను మూసినా తెరిచినా శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి  కనిపిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.

స్థానిక ఎన్నికల వ్యవహారంలో ప్రజాస్వామ్యం అపహాస్యం

      స్థానిక ఎన్నికల వ్యవహారంలో ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. సహకార సంఘాల ఓటర్ల నమోదును ఇళ్ళలో చేయిస్తుండడమే దీనికి ఉదాహరణన్నారు. కోర్టు ఆదేశంతో ఎన్నికల నిర్వహణకు పూనుకున్న ప్రబుత్వం  ప్రజాస్వామ్యాన్ని రోడ్డున పడేసిందన్నారు. మహానేత డాక్టర్ వైయస్ఆర్ అన్ని ఎన్నికలనూ సకాలంలో నిర్వహించారని చెప్పారు.  బాబు హయాంలో నాశనమైన సహకార వ్యవస్థకు ఎన్నో కోట్ల రూపాయలను ఇచ్చి వైయస్ఆర్ పునరుజ్జీవింప చేశారన్నారు. ప్రజలలో విశ్వాసాన్ని పాదుకొల్పారని గుర్తుచేశారు.

అధ్యక్షుల్ని నామినేట్ చేసుకోండి
      సహకార ఎన్నికలలో అవకతవకలకు పాల్పడే బదులు పార్టీ తరఫున అధ్యక్షుల్ని నామినేట్ చేసుకుంటే మంచిదని శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. ఓటర్ల నమోదు విధానం చూస్తే సిగ్గేస్తోందన్నారు.  ప్రజాస్వామ్యాన్ని  నవ్వులపాలు చేయవద్దని కోరారు. ఈ విషయమై పార్టీ ఎమ్మెల్యేలంతా త్వరలో గవర్నరును కలిసి నివేదిక ఇస్తామని చెప్పారు.  ఎన్నికలంటే ఎంత దారుణంగా ఉన్నాయో విచారణ చేపడితే వెల్లడవుతుందన్నారు.  ఎన్నికలను ఎదుర్కొనే సత్తా పార్టీలకు లేక ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇటువంటి పార్టీలు అవసరమా అని ఆయన ప్రశ్నించారు.

Back to Top