'పార్టీలో ఎవరేం చేస్తున్నదీ జగన్‌కు తెలుసు'

తిరుపతి: నియోజకవర్గాల్లోని పార్టీ నాయకులు, శ్రేణులు ఎవరేమి చేస్తున్నదీ శ్రీ జగన్మోహన్‌రెడ్డికి అన్నీ వివరంగా తెలుసు అని వైయస్‌ఆర్‌సిపి గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ చెప్పారని చంద్రగిరి నియోజకవర్గం నాయకుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. నూతన సంవత్సరం క్యాలెండర్‌ను శ్రీమతి విజయమ్మ ‌ఆవిష్కరించారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని తన నివాసంలో ఈ క్యాలెండర్‌ను సోమవారం ఆమె విడుదల చేశారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో 2013 నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ముద్రించారు. ఈ సందర్భంగా శ్రీమతి విజయమ్మ చంద్రగిరి నియోజకవర్గంపై ఆరా తీసినట్టు చెవిరెడ్డి చెప్పారు. పార్టీ పరిస్థితులు, సింగిల్‌విండో ఎన్నికలపై వివరాలు అడిగి తెలుసుకున్నట్టు తెలిపారు.

ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాలో మంత్రి ఆగడాలు, అధికార దుర్వినియోగం, కక్ష సాధింపులు, వాటిపై తాము చేస్తున్న పోరాటాల గురించి శ్రీమతి విజయమ్మ దృష్టికి తాను తీసుకెళ్ళినట్లు చెవిరెడ్డి తెలిపారు. ఇలాంటి బాధలు కొంతకాలం తప్పదని ఆమె చెప్పినట్లు పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లో మంచి రోజులు వస్తాయని అప్పటి దాకా పార్టీలోని నాయకులు, కార్యకర్తలు ధైర్యం, పట్టుదలతో ముందుకు వెళ్ళాలని శ్రీమతి విజయమ్మ సూచించినట్లు భాస్కర్‌రెడ్డి తెలిపారు.
Back to Top