పాదయాత్ర విజయవంతానికి సర్వమత ప్రార్థనలు

హైదరాబాద్, 6 ఫిబ్రవరి 2013: దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌లో తన పాదయాత్రను కొనసాగించేందుకు లోటస్‌పాండ్‌ నుంచి బుధవారం ఉదయం 9.40 గంటలకు బయలుదేరారు. శ్రీమతి షర్మిల పాదయాత్రకు బయలుదేరే ముందు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. శ్రీమతి షర్మిల కొనసాగించనున్న పాదయాత్ర విజయవంతం కావాలని ఆశీర్వదించారు. అనంతరం తన వాహనంలో పాదయాత్ర కొనసాగించే తుర్కయాంజాల్‌కు శ్రీమతి షర్మిల బయలు దేరారు. శ్రీమతి షర్మిలతోపాటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ కూడా ఉన్నారు.

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 2012 అక్టోబర్ 18న వైయస్ఆర్ జిల్లాలోని ఇడుపులపాయలో శ్రీమతి షర్మిల 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్రను ప్రారంభించారు. కడప, అనంతపురం, కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల మీదుగా రంగారెడ్డి జిల్లాలో శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. అయితే మోకాలి గాయంతో 2012 డిసెంబర్ 15న రంగారెడ్డి జిల్లాలోని తుర్కయాంజాల్ తన పాదయాత్రను ఆపేశారు. శస్త్ర చికిత్స అనంతరం కోలుకున్న శ్రీమతి షర్మిల తన పాదయాత్ర నిలిపివేసిన ఎస్ఎస్ఆర్ గార్డెన్స్ నుండి కొనసాగించనున్నారు.

Back to Top