టీడీపీ మాటల్లో తప్పులు కనిపించవా?

హైదరాబాద్, ఆగస్టు 22: శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆలోచనల తీరు మారాలని, సభా కార్యక్రమాలపై టీడీపీ కార్యకర్త మాదిరిగా తీర్పులు ఇవ్వకూడదని, ఆయన నిష్పాక్షికంగా వ్యవహరించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయన శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ...ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పట్ల స్పీకర్ వ్యవహరించిన తీరు సరికాదన్నారు. స్పీకర్ ను తామంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని గుర్తుచేస్తూ...అందరికీ సభలో సమానావకాశాలిస్తూ ఎటువైపు న్యాయమంటే అటువైపు వారిని మాట్లాడించే పరిస్థితుల్లో అసెంబ్లీని నడపాలన్నారు. ఒక పార్టీకి తొత్తుగా స్పీకర్ వ్యవహరించడమనేది ఎంత మాత్రం సమర్ధనీయం కాదన్నారు.

శుక్రవారం అసెంబ్లీలో జరిగిన సంఘటనలు, టీడీపీ వారు మాట్లాడిన తీరు చాలా బాధాకరమని, బూతు పద్యాలు రాసిన కవి చౌడప్ప వారసుల మాదిరిగా, చంద్రబాబు చెంబు గ్యాంగ్ మాదిరిగా వారు భాషను వినియోగిస్తున్నారని ఆయన విమర్శించారు. 'చనిపోయిన వ్యక్తి...ఈ రాష్ట్రానికి అయిదేళ్ళపాటు మేలు చేసి ప్రజలందరితో మహానేతగా గుర్తింపు పొందిన వైఎస్ రాజశేఖర రెడ్డిని హంతకుడని అంటే స్పీకర్ కు వినపడదు. కనపడదు. ఒక ప్రతిపక్ష నాయకుడిని ఉగ్రవాది, నరహంతకుడని నిందిస్తే స్పీకర్ కు తెలియదు. దానిని పట్టించుకోరు. ఇలా మాట్లాడటం తప్పు అని మేం మొర పెట్టుకుంటే పరిశీలిస్తామంటూరు.

ప్రతిపక్ష ఎమ్మెల్యేలను స్మగ్లర్లన్నా, దొంగలన్నా ఏమీ అనరు. మంత్రి గోపాలకృష్ణా రెడ్డి అయితే బరి తెగించి మాట్లాడుతూ...జగన్ చిప్పకూడు తిన్నారని అనడమేగాక ఇంకా చెప్పడానికి, రాయడానికి వీల్లేని పదాలు వాడారు. టీడీపీ వాళ్ళు ఇలాంటి భాష మాట్లాడితే స్పీకర్ నోరు మెదపరు, మేం పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తినా పరిశీలిస్తామంటారే తప్ప కనీసం స్పందన ఉండదు. జగన్ మోహన్ రెడ్డిని హంతకుడు, నరహంతకుడని దుర్మార్గంగా ఎవరైతే మాట్లాడారో వాళ్ళను మాత్రమే ఆయన బఫూన్లని అంటే తప్పేంటి? అలాంటి భాష వాడిన వాళ్ళు కచ్చితంగా బఫూన్లు కాక ఏమవుతారు? అని చెవిరెడ్డి ప్రశ్నించారు.

Back to Top