హైదరాబాద్, 28 జూలై 2013:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం సోమవారం మరో చరిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని ధనుపురం వద్దకు వెళ్ళే సరికి శ్రీమతి షర్మిల మొత్తం 3,000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంటారు. ఈ సందర్భంగా ధనుపురంలో జరిగే బహిరంగ సభలో వైయస్ అభిమానులు, పార్టీ శ్రేణులు, స్థానికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రజా కంటక కాంగ్రెస్ ప్రభుత్వం తీరుకు, దానితో నిస్సిగ్గుగా అంటకాగుతున్న ప్రధాన ప్రతిపక్షం నేత చంద్రబాబు వైఖరికి నిరసనగా శ్రీమతి షర్మిల ఈ చారిత్రక, సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్నారు. రాష్ట్ర ప్రజల కష్ట సుఖాలను స్వయంగా అడిగి తెలుసుకుని, అన్న శ్రీ జగన్మోహన్‌రెడ్డికి ఆ వివరాలను తెలపడం, కష్టాల్లో ఉన్న ప్రజలకు మేమున్నామంటూ భరోసానివ్వడం లక్ష్యంగా శ్రీమతి షర్మిల ప్రపంచంలో మరే మహిళా చేయని సాహస యాత్ర చేస్తున్నారు.
మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ముద్దుల తనయ శ్రీమతి షర్మిలకు పాదయాత్రకు ముందు రాజకీయాలు తెలియవు. రాజకీయ కుయుక్తులు అసలే తెలియవు. రాజకీయ వ్యూహ రచనకు ఆమడ దూరం ఉండేవారు. మహానేత ఆకస్మిక మరణం... జగనన్న జైలుకు వెళ్ళడం... శ్రీమతి షర్మిలను ప్రజాక్షేత్రంలోకి నడిపించాయి. జగనన్న వదిలిన ఈ బాణం ఇప్పుడు రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తోంది.
దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 'ప్రజాప్రస్థానం' పాదయాత్రను ఆదర్శంగా తీసుకుని, ఆయన అడుగుజాడల్లోనే ఈ మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు ఉపక్రమించారు. ఒక మహిళ ఇంత సుదీర్ఘ పాదయాత్ర చేయడం ఒక రికార్డు. శ్రీమతి షర్మిల పాదయాత్ర రికార్డుల కోసం కాదు. రాజన్న లేని రాజ్యంలో ప్రజలు ఎలా ఉంటున్నారో తెలుసుకుంటున్నారామె. పాదయాత్రలో ప్రజలతో మమేకమవుతూ ప్రతి ఇంటి బిడ్డగా మారిన శ్రీమతి షర్మిల ప్రజల ప్రాణాలు, ఆస్తులు ఎంత విలువైనలో చెబుతూ, వారి భవిష్యత్తు బాగుండాలని, జగనన్న వచ్చే వరకూ ఓపిక పట్టాలని ధైర్యాన్ని నూరిపోస్తున్నారు.
2012 అక్టోబర్ 18న వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయలోని మహానేత సమాధి వద్ద శ్రీమతి షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. 2013 జూలై 29 సోమవారం ఉదయం పాదయాత్ర ప్రారంభించిన కొద్దిసేపటికే 3,000 కిలోమీటర్లు పూర్తి చేస్తున్నారు. పాదయాత్ర సందర్భంగా శ్రీమతి షర్మిల ప్రజల నుంచి వేలాది ఫిర్యాదులు, విజ్ఞప్తులు స్వీకరించారు. వేలాది సమస్యలకు ఎక్కడికక్కడే పరిష్కారాలు చూపించారు. ఆరోగ్యశ్రీ, పింఛన్లు, ఫీజు రీయింబర్సుమెంటు, వేలాది స్థానిక సమస్యలను శ్రీమతి షర్మిల దృష్టికి ప్రజలు తీసుకువచ్చారు.
శ్రీమతి షర్మిల రాయలసీమలో 472 కిలోమీటర్లు, తెలంగాణలో 765.6 కిలోమీటర్లు నడిచారు. రాయలసీమలో 3 జిల్లాలు, తెలంగాణలో 4 జిల్లాలలో ఆమె పాదయాత్ర చేశారు. గుంటూరు జిల్లాలోకి ప్రవేశించడం ద్వారా శ్రీమతి షర్మిల కోస్తా జిల్లాల్లో పాదయాత్ర ప్రారంభించారు. చిట్టచివరిగా శ్రీకాకుళం జిల్లాలోని ధనుపురం వద్ద 3,000 కిలోమీటర్ల పాదయాత్ర మైలురాయిని శ్రీమతి షర్మిల అధిగమిస్తున్నారు.