ఓర్వలేకే శ్రీమతి షర్మిలపై ఆరోపణలు

నెల్లూరు:

వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మోకాలి శస్త్రచికిత్సపై టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు చేసిన వ్యాఖ్యలపై పార్టీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, ఒంగోలు, రాజంపేట శాసన సభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ఆ వ్యాఖ్యలను ఖండించారు. గాలి ముద్దుకృష్ణమనాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శ్రీమతి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానానికి రోజురోజుకు పెరుగుతున్న జనాదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నాయకులు తప్పుడు ఆరోపణలకు దిగుతున్నారని ఎంపీ మేకపాటి చెప్పారు.  శ్రీమతి షర్మిల కాలికి దెబ్బతగలలేదని టీడీపీ, బీజేపీ నాయకులు మాట్లాడడాన్ని మించిన నీచమైన అంశం లేదన్నారు. ఆమెకు  దెబ్బతగలకపోతే యాత్ర ఆపాల్సిన అవసరం ఎక్కడిదన్నారు. ఈపాటికి యాత్ర కోస్తా ఆంధ్రకు  చేరి ఉండేదన్నారు. కాలిదెబ్బకు వైద్యులు ఆపరేషన్ చేసిన అనంతరం ఆరు వారాలు విశ్రాంతి కావాలని చెప్పారన్నారు. తాజాగా వైద్యులు పరీక్షించిన అనంతరం పాదయాత్రకు ఉపక్రమించవచ్చని తెలిపారన్నారు. ఇవన్నీ అబద్ధమని కొందరు నాయకులు దిగజారి మాట్లాడడం దారుణమన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో విలేకరులతో మాట్లాడుతూ.. షర్మిల కాలి ఆపరేషన్ గురించి గాలి మాటలు కట్టిపెట్టాలని ముద్దుకృష్ణమనాయుడును హెచ్చరించారు. ‘షర్మిల కాలికి ఆపరేషన్ జరగలేదంటే నా కాలు తీయించుకుంటా, జరిగితే నీ కాలు తీయించుకుంటావా’ అని నిలదీశారు. శ్రీమతి షర్మిల పాదయాత్రపై చౌకబారు విమర్శలు మానుకోవాలని ముద్దుకృష్ణమనాయుడుకు ఆకేపాటి అమరనాథ రెడ్డి రాజంపేటలో సూచించారు. నోటి దురుసు మాటలు కట్టిపెట్టాలని హెచ్చరించారు.

Back to Top