<strong>చాగలమర్రి (కర్నూలు జిల్లా) :</strong> వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల పాదయాత్రకు వస్తున్న విశేష జనాదరణను చూసి ఓర్వలేకే ఆమె భర్త అనిల్‌కుమార్‌పై కాంగ్రెస్, టిడిపిలు కుట్ర పన్నుతున్నాయని వైయస్‌ఆర్‌సిపి శాసనసభ పక్ష ఉపనేత, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ఆరోపించారు. కర్నూలు జిల్లా చాగలమర్రిలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. వైయస్‌ఆర్‌సిపిని ఎదుర్కోలేక దైవ ప్రచారకుడు బ్రదర్ అనిల్ లక్ష్యంగా ఆ రెండు పార్టీల నాయకులు లేనిపోని విమర్శలు చేస్తున్నారన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ పార్టీలకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.<br/>అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందనే విషయాన్ని ప్రజలు మరిచిపోయే పరిస్థితి ఉందని శోభా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. తమ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి జైలు నుంచి బయటకు వస్తే ఉనికి కోల్పోతామనే భయంతో కాంగ్రెస్, టిడిపిలు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ప్రజల్లో టిడిపికి విశ్వాసం లేకుండాపోయిందని, కేవలం అధికారమే ధ్యేయంగా చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు.