ప్రతిపక్షనేతను అంతం చేస్తారా?

  • వైయస్‌ జగన్‌పై టీడీపీ ఏదో కుట్రపన్నుతోంది
  • రావెల వ్యాఖ్యలపై చంద్రబాబు సమాధానం చెప్పాలి
  • బాబు దళిత ఎమ్మెల్యేని అగౌరపరిచారు
  • ఇది ప్రజాస్వామ్యమేనా?
  • బాబుపై మేరుగునాగార్జున ఫైర్‌
  • గుంటూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏదో కుట్ర చేస్తోందని వైయస్‌ఆర్‌ సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేస్తున్న రావెల కిషోర్‌ బాబు జన్మభూమి కార్యక్రమంలో ప్రతిపక్ష నాయకుడిని అడ్డుతొలగించుకోవడం లెక్కకాదు అని మాట్లాడడం పట్ల ఏదో కుట్ర జరుగుతున్నట్లుగా అనిపిస్తోందని మేరుగు పేర్కొన్నారు. అంటే ప్రతిపక్షనేతపై దాడి చేయదల్చుకున్నారా లేక అంతమొందించదలిచారా అని రావెలను ప్రశ్నించారు. చంద్రబాబు, ఊసరవెల్లి రావెల కిషోర్‌లు కలిసి ఏదో కుట్ర పన్నుతున్నారని చెప్పారు. రావెల వ్యాఖ్యలపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. గుంటూరు జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైయస్‌ఆర్‌సీపీ నేతలు మేరుగు నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే ముస్తఫాలు మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజానాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆరోపణలు చేయడానికి నీకు ఎత్తదమ్ముందని రావెలను మేరుగు నిలదీశారు. శిఖండి రావెల కిషోర్‌కు ధైర్యం ఉంటే చర్చకు వచ్చి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఏ విధంగా అంతమొందిస్తావో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆడదానివైతే చంద్రబాబుతో చెప్పి తప్పుఒప్పుకొని క్షమాపణ చెప్పాలని సూచించారు. చేతగాని దద్దమ్మ రావెల కిషోర్‌  చంద్రబాబు పక్కన చేరి ఆయన అడుగులకు మడుగులు ఒత్తుతున్నాడని మండిపడ్డారు. ప్రజానాయకుడిపై ఇలాంటి స్టేట్‌మెంట్‌లు ఇస్తే ప్రజలు క్షమించరని విరుచుకుపడ్డారు.

    దళితులకు ప్రజాస్వామ్య విలువలు లేవా..?
    గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో బలహీనవర్గాల ఆశాజ్యోతి సావిత్రిబాయ్‌ 186వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మేరుగు మాట్లాడుతూ సేవా తత్పరురాలు సావిత్రిబాయ్‌ ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ఆమె ఆలోచనలు ముందుకు వెళ్లాల్సిన తరుణంలో ఏపీలో పరిపాలన రాజ్యాంగానికి విరుద్శంగా సాగుతోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు రాజ్యాంగ విలువలకు పాతరేసి సొంత చట్టాలను రూపొందించుకొని పరిపాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు నిన్న కర్నూలులో జరిగన టీడీపీ బహిరంగ సభే నిదర్శనమన్నారు. ముచ్చుము్రరి ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ముఖ్యమంత్రికి దళితుల పట్ల ఎంత గౌరవం ఉందో సభ ద్వారా ప్రజలందరికీ అర్థమైందన్నారు. రాజ్యాంగ విలువలతో, ప్రజాబలంతో గెలిచిన దళిత ఎమ్మెల్యే ఐజయ్యను అగౌరపరిచారని దుయ్యబట్టారు. దళిత చట్టాలను దుర్వినియోగ పరుస్తూ, దళితులపై దాడులు చేయిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్న చంద్రబాబు చదువుకున్న దళిత శాసనసభ్యుడిని నిండు సభలో అవమానపర్చడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఐజయ్యకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వలేదని, దళితులకు ప్రజాస్వామ్య విలువలు లేవా..? అని చంద్రబాబును ప్రశ్నించారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంతో దళితులు తలెత్తుకొని తిరిగేలా పరిపాల చేశారని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు పాలనలో దళితుల మనోభావాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఐజయ్యను అగౌరవపరిచిన తీరుపై దళితలోకం అసహ్యంచుకుంటోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు నిజంగా ప్రజానాయకుడైతే దళితుల చట్టాలను ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

    రావెలకు పిచ్చిపట్టినట్లుంది
    చంద్రబాబు దగ్గరున్న ఎస్సీ ఎమ్మెల్యేలు, మంత్రులు డూడూ బసవన్నల్లా, కళ్లులేని కబోదుళ్లా దళితులకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదని మేరుగు విమర్శించారు. గుంటూరు జిల్లా మంత్రి రావెలకు మానసిక స్థితి సరిగ్గాలేనట్లుగా అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలతోనే గొడవలు పడుతూ తిట్టించుకొని కాళ్లు పట్టుకుంటున్నారని విమర్శించారు. పరిపాలనను గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం డబ్బు సంపాదనే లక్ష్యంగా కిరాతకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులకు రాబోయే రోజుల్లో దళితుల అగ్గిలో మీ పార్టీ ఆహుతి అయిపోతుందని చంద్రబాబుకు చురకంటించారు. 
Back to Top