ఆపరేషన్‌ ‘భూమా’– టీడీపీ ఎత్తుకు శిల్పా పైఎత్తు

– వైయస్సార్సీపీలో చేరిన భూమా వర్గీయులు
– టీడీపీకి షాక్‌...క్యూలో మరికొందరు

నంద్యాల: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు నారాయణ, అఖిలప్రియ వైయస్సార్సీపీలో చేరిన ఒక కౌన్సిలర్‌ను తమవైపుకు తిప్పుకుంటే, వైయస్సార్సీపీ అభ్యర్థి ఏకంగా ఆపరేషన్‌ ‘భూమా’ను చేపట్టారు. మంత్రి భూమా అఖిలప్రియ వర్గంలో ఉన్న అసంతృప్తులను ఆయన తనవైపుకు తిప్పుకోవడం ప్రారంభించారు. భూమాకు సన్నిహితుడిగా ఉన్న న్యాయవాది గోపినాథరెడ్డి, మాజీ కౌన్సిలర్‌ బాలపక్కిరయ్యను తనవైపుకు తిప్పుకొని మంత్రి అఖిలప్రియకు షాక్‌నిచ్చారు. మరికొందరు భూమా వర్గీయులు వైయస్సార్సీపీలో చేరడానికి క్యూ కట్టినట్లు సమాచారం.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత నెల 21న ఉప ఎన్నిక దృష్ట్యా నంద్యాలలో ఇఫ్తార్‌ విందుకు హాజరైనప్పుడు, కొందరు వైయస్సార్సీపీలో చేరిన కౌన్సిలర్లకు ప్రలోభాలతో ఎరవేశారు. అయితే ఒకే కౌన్సిలర్‌ మాత్రమే వీరి ప్రలోభాలకు లొంగారు. దీంతో శిల్పామోహన్‌రెడ్డి టీడీపీని ఎదురుదెబ్బ తీయడానికి ఆపరేషన్‌ భూమాను చేపట్టారు. ఆయన ప్రతిరోజూ వార్డుల వారిగా ఉన్న ద్వితీయ, తృతీయ శ్రేణి పార్టీ నేతలను, కార్యకర్తలను కలిసి, వీరి సమస్యలను తెలుసుకొని తాను అండగా ఉంటానని, తనకు సహాయం చేయాలని కోరారు. 
పార్టీలో చేరిన నేతలు..
ప్రముఖ న్యాయవాది, గోపవరం గోపినాథరెడ్డి దివంగత ఎమ్మెల్యే భూమాకు సన్నిహితులు. భూమా వైయస్సార్సీపీలో ఉన్నప్పుడు పార్టీ అధికార ప్రతినిధిగా పని చేశారు. తర్వాత భూమా టీడీపీలో చేరడానికి ఆయన వ్యతిరేకించి, దూరంగా ఉన్నారు. శిల్పా ఇతన్ని కలిసి, మద్దతు కోరడంతో అంగీకరించారు. దీంతో ఆయన శిల్పా సమక్షంలో తిరిగి వైయస్సార్సీపీకి వచ్చారు. నూనెపల్లె ప్రాంతం టీడీపీకి పెట్టని కోట. గౌడ్, కాపు సామాజిక వర్గాల ఓటర్లు టీడీపీకి మద్దతుగా ఉన్నారు. అయితే, టీడీపీకి చెందిన మాజీ కౌన్సిలర్‌ బాలపక్కిరయ్య కొంత కాలంగా స్థానిక నేతల వైఖరి నచ్చక అసంతృప్తితో ఉన్నారు. దీంతో శిల్పా వ్యూహాత్మకంగా అతనితో మంతనాలు జరిపారు. తర్వాత బాలపక్కిరయ్య,∙మైనార్టీ నేత గఫూర్‌ మరికొందరు వైయస్సార్సీపీలో చేరారు. దీంతో టీడీపీకి షాక్‌ తగిలింది.
క్యూ కట్టిన నేతలు...
వైయస్సార్సీపీలో చేరడానికి అధికార పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు క్యూకట్టినట్లు తెలుస్తోంది. పార్టీ అభ్యర్థి శిల్పా వీరితో ప్రత్యక్షంగా, పరోక్షంగా మంతనాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొంత మంది అధికార పార్టీ నేతలు వైఎస్సార్సీపీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఉన్న శిల్పా నంద్యాలకు రాగానే మరో ఇద్దరు ప్రముఖ నేతలు వైఎస్సార్సీపీలో చేరడానికి రంగం సిద్ధమైంది.

Back to Top