'చంద్రగిరి'లో 150 ప్రజానేత విగ్రహాల ఏర్పాటు

 హైదరాబాద్, 29 ఆగస్టు 2012 : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి రోజు సెప్టెంబర్‌ 2న  'పల్లెపల్లెలో ప్రజానేత విగ్రహం' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చంద్రగిరి నియోజకవర్గం ఇన్‌చార్జి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన ఈ విషయం వెల్లడించారు. ఆ రోజున చంద్రగిరి నియోజకవర్గంలో 150 వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించి, నివాళులు అర్పిస్తామన్నారు. వైయస్‌రాజశేఖరరెడ్డి విగ్రహాల ఆవిష్కరణ సందర్భంగా అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం 138 గ్రామాలు ఉన్నాయని, చిన్నా పెద్దా గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో మొత్తం 150 వైయస్‌రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వివరించారు. వైయస్‌రాజశేఖరరెడ్డి వర్ధంతిని చంద్రగిరి నియోజకవర్గంలో అత్యంత ఘనంగా నిర్వహించాన్నది తమ ఆకాంక్ష అని చెవిరెడ్డి తెలిపారు. వైయస్‌రాజశేఖరరెడ్డి వర్ధంతికి నాలుగు రోజులు ముందుగానే విగ్రహాలను ఆయా గ్రామాల నాయకులకు అందేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.విగ్రహాలన్నింటినీ హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారంనాడు పార్టీ ముఖ్య నేతలందరి సమక్షంలో ప్రదర్శించారు. వేదపండితులతో విగ్రహాలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు శోభా నాగిరెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, కొణతాల రామకృష్ణ, డి.ఎ. సోమయాజులు, కె.కె. మహేందర్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వై.ఎస్‌ అనిల్‌రెడ్డి, కార్మిక విభాగం కన్వీనర్‌ బి.జనక్‌ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన ఇతర పార్టీల ముఖ్య నాయకులు చంద్రబాబు నాయుడు, గాలి ముద్దుకృష్ణమనాయుడు, చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌, మంత్రి గల్లా అరుణకుమారి, రెడ్డివారి నాదమునిరెడ్డి లాంటి వారు పుట్టిన గ్రామాలలోని ప్రజలు కూడా వైయస్‌ఆర్‌ విగ్రహాలను తమ తమ గ్రామాల్లో ఏర్పాటు చేసేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చారని ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి వెల్లడించారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పుట్టిన నారావారిపల్లె గ్రామస్థులు వైయస్‌రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు ఉత్సాహం చూపించారని ఆయన అన్నారు.వైయస్‌ కుటుంబంలోని మూడు తరాలవారితో శిష్యుడిగా, అనుచరుడిగా విద్యార్థి దశ నుంచే తనకు అనుబంధం ఉందని ఆయన చెప్పారు. వైయస్‌ కుటుంబం నుంచే తాను పోరాట స్ఫూర్తిని పొందినట్టు చెవిరెడ్డి పేర్కొన్నారు.

Back to Top