వైయస్‌ పథకాల అమలు సత్తా జగనన్నకే ఉంది

కడప/ తిరుపతి:

రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా రైతులు, విద్యార్థులు, చేనేత కార్మికుల కోసం, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం పోరాటం చేసింది వైయస్ఆర్‌సీపీ,‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి మాత్రమే అని శ్రీమతి వైయస్‌ షర్మిల ఉద్ఘాటించారు. జనం బాగోగులే జగనన్నకు ముఖ్యం అన్నారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను సమర్థంగా అమలు చేయగలిగే సత్తా జగనన్నకు మాత్రమే ఉం‌దన్నారు. ఒక్క అవకాశం ఇస్తే.. మీ సంక్షేమం కోసం తన జీవితాన్నే అంకితమివ్వడానికి జగనన్న సిద్ధంగా ఉన్నారన్నారు. వైయస్ఆర్ జనభేరిలో భాగంగా శ్రీమతి షర్మిల సోమవారం వైయస్ఆర్‌ జిల్లా రాజంపేట, సుండుపల్లె, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలలో ప్రసంగించారు. రాజంపేట పార్లమెంటు అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి ఆకేపాటి అమర్‌నాథరెడ్డిలతో కలిసి రాజంపేట, సుండుపల్లెలో రోడ్‌షో నిర్వహించారు.

'ఐదు సంతకాలతో జగనన్న రాష్ట్రం దిశ, దశ మార్చి చూపిస్తాడు’ అని శ్రీమతి షర్మిల తెలిపారు. మరోవైపు చంద్రబాబు ప్రజావ్యతిరేక కాంగ్రెస్ సర్కారుకు అండగా నిలిచారని ఆరోపించారు. కాలర్ పట్టుకుని నిలదీయడం మరచి భుజాన ఎత్తుకుని మోశా‌రని దుయ్యబట్టారు. విప్ జారీ చేసి‌ మరీ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడా‌రన్నారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఏవేవో చేస్తానంటూ అడ్డగోలుగా వాగ్దానాలు చేసేస్తున్నారు.

అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఉచిత కరెంటు ఇస్తామని చెబితే ఈ చంద్రబాబు కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని హేళన చేశారని దుయ్యబట్టారు. ఈ రోజు నిస్సిగ్గుగా అదే వాగ్దానం, అదే ఉచిత కరెంటు నేనూ ఇస్తానని చెబుతున్నారన్నారు. రాజశేఖరరెడ్డి గారు ఫీజు రీయింబర్సు ఇస్తే.. చంద్రబాబు నేను కూడా ఉచితంగా విద్యనందిస్తానంటున్నారని ఎద్దేవా చేశారు. రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పెడితే... ఇప్పుడు చంద్రబాబు నేను కూడా ఉచితంగా వైద్యాన్ని అందిస్తానంటున్నారు. కానీ నక్క ఎన్ని వాతలు పెట్టుకున్నా... నక్కనక్కే... పులి పులే అని దుయ్యబట్టారు.

తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేయలేదని శ్రీమతి షర్మిల సూటిగా ప్రశ్నించారు. వాగ్దానాలు చేయడం... వాటిని మరిచిపోవడం చంద్రబాబుకు అలవాటేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీలతో కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడి రాష్ట్రాన్ని కొబ్బరి ముక్కల్లా విడగొట్టడానికి చంద్రబాబు ఇచ్చిన లేఖే కారణమని విమర్శించారు.

Back to Top