ఓటుకి కోట్లు కు ఏడాది

() అడ్డ‌గోలుగా అవినీతికి పాల్ప‌డుతూ దొరికిపోయిన చంద్ర‌బాబు
() ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేస్తూ దొరికిన బాబు అండ్ గ్యాంగ్‌
() ఆడియో, వీడియో టేపుల‌తో ఏడాది క్రితం సంచ‌ల‌నం
() అడ్డ‌దారిలో కేసు సెటిల్ చేసుకొన్న చంద్ర‌బాబు

హైద‌రాబాద్‌) స‌రిగ్గా ఏడాది క్రితం రాష్ట్ర వ్యాప్తంగా చంద్ర‌బాబు పేరు మార్మోగిపోయింది. నేనునిప్పు.. రాజ‌కీయాల‌కు ఒర‌వ‌డి దిద్దింది నేను.. నాయ‌కుల‌కు పాఠాలు నేర్పేది నేను.. అంటూ గొప్ప‌లు చెప్పుకొనే చంద్ర‌బాబు వాస్తవ రూపం ప్ర‌జ‌ల‌కు తెలిసింది.  రూ.150 కోట్లతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగిన ఆ దుర్మార్గపు ప్రయత్నాన్ని అవినీతి నిరోధక శాఖ బ‌ట్ట‌బ‌య‌లు చేసింది. శాసనమండలి ఎన్నికల్లో తమ అభ్యర్థికి ఓటేసేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ.5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని.. అడ్వాన్స్ ఇస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని రెడ్ హ్యాండెడ్‌గా అరెస్టు చేసింది. సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు చంద్రబాబు పాల్పడిన దిగజారుడు రాజకీయాలు బ్రీఫ్ డ్ భాష‌తో స‌హితంగా బ‌య‌ట ప‌డ్డాయి. అదే సమయంలో స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు నేరుగా మాట్లాడిన ఆడియో రికార్డులూ బహిర్గతమయ్యాయి.

 
మొద‌ట నుంచి టీడీపీ ది అదే బాట‌
శాసనమండలి ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి కోట్ల రూపాయలు పెట్టి ఎమ్మెల్యేలను కొనేందుకు తెలుగుదేశం పార్టీ కుట్ర పన్నింది. టీడీపీ పెద్దలు ఏటా నిర్వహించే మహానాడు వేదికగానే కుట్రకు బీజం పడింది. ఈ వ్యవహారంలో భాగస్వాములైన వ్యక్తుల ద్వారానే ఈ విషయం వెల్లడైంది. మహానాడు పనుల కంటే ఎమ్మెల్యేల కొనుగోలే ముఖ్యమని తమ పార్టీ నేత సెబాస్టియన్‌తో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చెప్పిన విషయాలు వెలుగు చూశాయి.
‘ఓటుకు కోట్లు’ వ్యవహారాన్ని పక్కాగా అమలు చేసే కుట్రలో పార్టీ ‘బిగ్ బాస్’ నుంచి చిన్నాచితకా నాయకుల దాకా భాగం పంచుకున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు ద్వారా ఎమ్మెల్సీ స్థానం నెగ్గాక... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్నే పడగొట్టే కుటిలయత్నానికి వ్యూహ రచన చేశారు. అందుకోసం భారీగా డబ్బు సమకూర్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో బేరసారాలూ మొదలుపెట్టారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారు.
 
 బాస్ బాట‌లో రేవంత్ రెడ్డి
ఎమ్మెల్యేల కొనుగోలు కోసం టీడీపీ బిగ్‌బాస్ ఆదేశాల మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి బరిలోకి దిగారు. తొలుత నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి బేరసారాలు చేశారు. అయితే వారి వలకు చిక్కని స్టీఫెన్‌సన్ టీడీపీ నేతల కుటిల యత్నాలపై ఏసీబీకి సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు... ఈ వ్యవహారంలో పెద్ద పెద్ద వారు ఉండడంతో రెడ్ హ్యాండెడ్‌గా బహిర్గతం చేయాలని నిర్ణయించారు. 

మొత్తం వ్యవహారాన్ని రికార్డు చేసేందుకు రహస్య కెమెరాలు ఏర్పాటు చేశారు. రేవంత్ వచ్చి స్టీఫెన్‌సన్‌తో బేరసారాలు సాగించారు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థికి ఓటేస్తే ఏం కావాలన్నా చూసుకుంటామంటూ ఆశ చూపారు. అంతేకాదు ఏపీలో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే ఎంపిక ఇంకా పూర్తికాలేదని, ఏమైనా తేడా జరిగితే అక్కడ అవకాశం కల్పిస్తామనీ ప్రలోభపెట్టారు. ఏ చిన్న అవసరమొచ్చినా చేసి పెడతామని ఆశ చూపారు. అంతేకాదు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరే నేరుగా కూర్చోబెట్టి మాట్లాడిస్తామని హామీ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఏసీబీ ఏర్పాటు చేసిన రహస్య కెమెరాల్లో రికార్డయ్యాయి.
 
నిందితుల‌కు టీడీపీ అండ
 ‘ఓటుకు కోట్లు’ కేసులో నాలుగో నిందితుడు, టీడీపీకి సన్నిహితంగా ఉండే జెరూసలెం మత్తయ్య వ్యవహారం అనేక మలుపులు తిరిగింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ ను ప్రలోభపెట్టేందుకు మధ్యవర్తిగా మత్తయ్య వ్యవహరించాడని ఏసీబీ స్పష్టం చేసింది. రేవంత్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడగానే మత్తయ్య హైదరాబాద్ నుంచి విజయవాడకు మకాం మార్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ విజయవాడ సిటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కేసీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్ నేతలు తనను బెదిరిస్తున్నారని, చంపుతామంటూ ఫోన్లు వస్తున్నాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

తర్వాత చాలా రోజులు అక్కడే ఉండి.. ఏదో స్టేట్‌మెంట్ ఇస్తూ వచ్చారు. ఏసీబీ విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరిగారు. ఇక ఏసీబీకి మత్తయ్య దొరికితే చాలా ఇబ్బందులొస్తాయని గ్రహించిన టీడీపీ నేతలు ఆయనను రక్షించే పనిలో పడ్డారు. తనపై తెలంగాణ ఏసీబీ అధికారులు పెట్టిన కేసు కొట్టేయాలంటూ మత్తయ్యతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించారు. దీనిపై వాదనలు వినిపించేందుకు ఏకంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదినే రంగంలోకి దింపారు. వాదనలు విన్న హైకోర్టు.. మత్తయ్య అరెస్టుపై స్టే విధించింది. అయితే ఈ సమయంలో హైకోర్టులో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరకు మత్తయ్య పిటిషన్‌పై ఇన్‌కెమెరా ప్రొసీడింగ్స్ జరిగేంత వరకు వెళ్లింది. వాదనలు విన్న న్యాయమూర్తి గత నెలలో తీర్పును వాయిదా వేశారు.

చీక‌టి ఒప్పందాల సాక్షిగా..
మొత్తం మీద అవినీతి బాగోతం ఎంత వేగంగా, ప‌గ‌డ్బందీగా బ‌ట్ట‌బ‌య‌లు అయిందో అంతే స్తాయిలో చ‌ల్లారిపోయింది. తెర వెనుక జరిగిన ఒప్పందాలు, అండ‌ర్ స్టాండింగ్ ల పుణ్య‌మా అని చంద్ర‌బాబు మ‌ళ్లీ తిరిగి నీతులు చెబుతూ చెల‌రేగుతున్నారు. దీంతో అవినీతి నిరోధ‌క శాఖ ద‌ర్యాప్తు, విచార‌ణ అట‌క ఎక్కాయి. ఎక్క‌డి దొంగ‌లు అక్క‌డే గ‌ప్ చుప్ గా ఉండిపోయారు. 
Back to Top