జగన్‌ ఆరోగ్యంపై అధికారిక బులెటిన్‌ ఇవ్వాలి

హైదరాబాద్, 29 ఆగస్టు 2013:

ఇరు ప్రాంతాలకూ సమన్యాయం చేయాలంటూ చంచల్‌గూడ జైలులో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వెంటనే అధికారికంగా హెల్తు బులెటిన్ విడుదల చేయాలని పార్టీ ‌నాయకుడు, బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు డిమాండ్ చేశారు.‌ గడచిన ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై కోట్లాది మంది అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆయన తెలిపారు. ఇప్పటికైనా అధికారిక బులెటిన్ విడుదల చేయకపోతే మరింతగా ఆందోళన పెరిగే‌ అవకాశాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. లోటస్‌పాండ్‌లోని శ్రీమతి విజయమ్మ నివాసం వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆహారం తీసుకోకుండా 100 గంటల పాటు ఉంటే విపరీతమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్న నేపథ్యంలో శ్రీ జగన్‌ విషయంలో అధికారులు మీడియాకు లీకులు ఇస్తున్నారు తప్ప అధికారికంగా ఎలాంటి సమాచారాన్ని ఇవ్వడం లేదని అన్నారు.

ప్రజా సమస్యల మీద పోరాడుతూ.. నిత్యం ప్రజలతో మమేకం అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్, టిడిపిలు కలిసి కుట్ర చేసి జైలులో పెట్టించాయని, ప్రజలకు ఆయనను దూరం చేశాయని పార్టీ నాయకుడు, బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు నిప్పులు చెరిగారు. ప్రజల మధ్యలో ఉండి పోరాటాలు చేసే అవకాశం తనకు లేని కారణంగా శ్రీ జగన్మోహన్‌రెడ్డి తన తల్లి శ్రీమతి విజయమ్మ, చెల్లెలు శ్రీమతి షర్మిల ద్వారా ఉద్యమాలు చేయిస్తున్న వైనాన్ని రంగారావు ఈ సందర్భంగా ప్రస్తావించారు. జైలులో ఉండి ప్రత్యేకమైన పరిస్థితుల్లో శ్రీ జగన్‌ దీక్ష చేస్తున్నందున బయటి నుంచి వైద్యులు వెళ్ళి పరీక్షించే అవకాశం లేదన్నారు. అందుకే జైలు లోపల‌ శ్రీ జగన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నదో అని కోట్లాది మంది అభిమానులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఆయన ఆరోగ్యంపైన స్పష్టంగా అధికారిక సమాచారం వారికి అందాలన్నారు. శ్రీ జగన్‌ ఆరోగ్య పరిస్థితిపై అధికారిక బులెటిన్‌ విడుదల చేయాలని పార్టీ ప్రతినిధి బృందం కూడా జైళ్ళ శాఖ అధికారికి కలిసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని ఆయన తెలిపారు.

ఐదు రోజులుగా శ్రీ జగన్మోహన్‌రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నా
ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని పార్టీ ఎమ్మెల్యే కొరముట్ల
శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన ఆరోగ్యం ఏమాత్రం క్షీణించినా
కాంగ్రెస్‌ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన హెచ్చరించారు. సీమాంధ్రలోనే
కాకుండా తెలంగాణ ప్రాంతం నుంచి కూడా శ్రీ జగన్, శ్రీమతి వైయస్‌ విజయమ్మ
దీక్షలకు రాష్ట్రంలోని నలుమూలల నుంచీ ప్రజల నుంచి విపరీమైన ప్రతిస్పందన,
మద్దతు లభిస్తోందన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.

Back to Top